విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసు.. స్పందించిన సౌరవ్ గంగూలీ
Ganguly DENIES reports of him wanting to send show-cause notice to Virat Kohli.టీమ్ఇండియా మాజీ కెప్టెన్
By తోట వంశీ కుమార్ Published on 22 Jan 2022 6:19 AM GMTటీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బావించగా.. బీసీసీఐ కార్యదర్శి జై షా జోక్యం చేసుకుని గంగూలీకి సర్థిచెప్పినట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. దీనిపై సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆ వార్తలను కొట్టిపారేశాడు. ఆ వార్తల్లో నిజంలేదని, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీకి రాజీనామా చేయగా.. సెలక్షన్ కమిటీ వన్డేల్లో నాయకత్వ బాధ్యతల నుంచి కోహ్లీని తప్పిస్తూ ఆ బాధ్యతలను హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మకు అప్పగించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఒకే కెప్టెన్ ఉంటేనే బాగుంటుందని బావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఇక దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు దీనిపై విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దంటూ తనను ఎవరూ కోరలేదని, ఇక వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందు మాత్రమే చెప్పారన్నాడు. కాగా.. అంతకముందు గంగూలీ చేసిన ప్రకటనలో కెప్టెన్నీ నుంచి తప్పుకోవద్దు అంటూ కోహ్లీని తాను కోరానని ఆ చెప్పాడు.
గంగూలీ చెప్పిన దానికి, కోహ్లీ మాట్లాడిన దానికి ఎక్కడా పొంతన లేదు. దీంతో ఒకానొక దశలో కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు గంగూలీ సిద్దం అయ్యాడట. అయితే.. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ వివాదం పెద్దది కాకుండా గంగూలీకి నచ్చజెప్పాడని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే గంగూలీ స్పందించి ఈ వార్తలపై స్పష్టత నిచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం కోహ్లీ.. సుదీర్ఘ పార్మెట్‌లో కూడా కెప్టెన్సీని వదులుకున్నాడు. కాగా.. ఇప్పటి వరకు టెస్టు కెప్టెన్‌గా బీసీసీఐ ఎవ్వరిని నియమించలేదు.