ఈ ఇద్ద‌రి గురించే తీవ్ర‌మైన చ‌ర్చ‌.. గంభీర్‌కు హార్దిక్ కావాలి.. రోహిత్‌కు గిల్ ఉండాలి..!

ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 6 నుంచి భారత్‌లో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది.

By Medi Samrat  Published on  19 Jan 2025 11:17 AM IST
ఈ ఇద్ద‌రి గురించే తీవ్ర‌మైన చ‌ర్చ‌.. గంభీర్‌కు హార్దిక్ కావాలి.. రోహిత్‌కు గిల్ ఉండాలి..!

ఇంగ్లండ్‌తో ఫిబ్రవరి 6 నుంచి భారత్‌లో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శనివారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్‌లలో వైస్ కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విష‌య‌మై సుదీర్ఘ‌మైన‌ చర్చ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా చేయాలని కోరగా, కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శుభ్‌మాన్ గిల్‌ను చేద్ధామ‌ని మొండిగా ఉన్నట్లు బీసీసీఐ మూలాల ద్వారా తెలియ‌వ‌చ్చిన‌ట్లు జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొన్నాయి. ఈ ఇద్దరి విషయమై గంభీర్, అగార్కర్, రోహిత్ మధ్య కొద్దిపాటి వాగ్వాదం కూడా జరిగిందనేది కధనాల సారాంశం.

ఇది మాత్రమే కాదు.. T-20ల‌లో ఒక క్యాలెండర్ ఇయ‌ర్‌లో మూడు అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్‌గా తీసుకోవాలని ప్రధాన కోచ్ గంభీర్ కోరుకున్నాడు. అయితే సెలెక్టర్లు రిషబ్ పంత్‌పై విశ్వాసం వ్యక్తం చేశారు. కేఎల్ రాహుల్ మరో వికెట్ కీపర్‌గా ఎంపిక‌య్యాడు.

భారత జట్టులోని అన్ని ఫార్మాట్లకు రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. ఆల్‌రౌండర్ హార్దిక్ వన్డే, T-20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అక్టోబర్-నవంబర్‌లో స్వదేశంలో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ కెప్టెన్‌గా, హార్దిక్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. గాయం కారణంగా హార్దిక్ టోర్నీ నుంచి వైదొలగడంతో రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సంవత్సరం డిసెంబర్‌లో ముంబై ఇండియన్స్ రోహిత్‌ని తొలగించి హార్దిక్‌ని తమ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి భారత్‌.. దక్షిణాఫ్రికా, శ్రీలంకతో కేవలం రెండు వన్డే సిరీస్‌లు మాత్రమే ఆడింది. 2023 డిసెంబర్ 17 నుండి 21 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్ నుండి రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. హార్దిక్ ఫిట్‌గా లేడు. రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గిల్ వన్డే జట్టులో కూడా లేడు.

గత ఏడాది శ్రీలంకలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్‌ను వన్డే, T20 రెండింటికీ వైస్ కెప్టెన్‌గా నియమించారు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్ తిరిగి కెప్టెన్‌గా వచ్చాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు T-20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన‌ తర్వాత ఈ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత T-20 వైస్-కెప్టెన్ హార్దిక్‌కు జ‌ట్టు పగ్గాలు అప్పగించాలని అనుకున్నారు. అయితే సూర్యకుమార్ యాదవ్‌ను పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించారు. అతడే ఇంగ్లండ్‌తో జరిగే T20 సిరీస్‌కు కూడా కెప్టెన్‌గా ఉంటాడు. ఇలా చాలా రోజులుగా కెప్టెన్సీ, వైఎస్ కెప్టెన్సీపై మార్పుల చ‌ర్చ జ‌రుగుతోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ల‌ కోసం జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా (ఇంగ్లండ్ సిరీస్‌కు మాత్రమే).

Next Story