భారత్‌ను వెంటాడుతున్న గాయాలు.. 11మంది కూడా ఫిట్‌గా లేరా..!
Full List of Indian cricketers who are currently injured.టీమ్ఇండియాకు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2021 8:02 PM ISTటీమ్ఇండియాకు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఏ ముహూర్తాన ఆస్ట్రేలియా పర్యటన మొదలైందో కానీ భారత్ కష్టాలు పరాకాష్టకు చేరాయి. ఐపీఎల్‌లో గాయపడి కొందరు టూర్‌కు దూరమైతే ఆసీస్‌కు వచ్చాక ఇక్కట్లు రెట్టింపయ్యాయి. అత్యంత విపత్కర పరిస్థితుల్లో స్పూర్తిదాయక పోరాటంతో సిరీస్‌లో 1-1 తో సమంగా నిలిచింది. అయితే.. ప్రస్తుతం భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ ఆస్పత్రి వార్డులా ఉంది. జట్టు ఉత్సాహాంతో ఉన్నా ఫిట్‌గా ఉన్న 11 మంది ఆటగాళ్ల కోసం వెతుకోవాల్సి పరిస్థితి తలెత్తింది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లనూ ఆడించాల్సిన పరిస్థితి.
టెస్టు సిరీస్‌లో షమీ నుంచి బుమ్రా వరకు ఏకంగా ప్రధాన పేస్ దళం మొత్తం వైదొలిగింది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజే.. నిర్ణయాత్మక నాలుగో టెస్టులో ప్రధాన పేసర్ కానున్నాడు. మూడో టెస్టులోనే ఐదుగురు ప్లేయర్స్ గాయాలపాలయ్యారు. ప్రస్తుతం టీమ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా ఉదర కండరాలు పట్టేయడంతో నాలుగో టెస్ట్‌కు దూరమయ్యాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా గాయాలతో సిరీస్ నుంచి ఔట్ అయ్యారు. మూడో టెస్టును డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం తీవ్ర వెన్నునొప్పితో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న అశ్విన్.. నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టులో బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది. గాయంతో బాధపడుతున్న అశ్విన్ పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. చివరి టెస్టుకు మరొక్కరోజే సమయం ఉండడంతో రహానే సేనలో ఆందోళన మొదలైంది. ఒకవేళ యాష్ ఫిట్‌గా లేకుంటే.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
గాయపడ్డ విహారి స్థానంలో మయాంక్ అగర్వాల్ నాలుగో టెస్టులో ఆడాల్సిఉంది. కానీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. గ్లోవ్స్‌కు బంతి తగిలి గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కాదని తేలితే.. అతడు నాలుగో టెస్టు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం నెట్‌బౌలర్‌గా కొనసాగుతున్న వాషింగ్టన్ సుందర్ అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్నాయి. గబ్బా పేస్‌కు అనుకూలం కావడంతో.. జడేజా స్థానంలో పేసర్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. జడేజా స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ ముగ్గురు పేసర్లతో బరిలో దిగాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ అశ్విన్ దూరమయి నలుగురు పేసర్లతో ఆడాలనుకుంటే.. టీ నటరాజన్ ఆడనున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే.. కుల్దీప్ ఆడతాడు. రహానే ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి.
ఇప్పటి వరకు గాయపడిన ఆటగాళ్లు ఎవరు అంటే..?
భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, రిషబ్‌పంత్. ఇందులో హిట్‌మ్యాన్ రోహిత్‌తో ఫిట్‌గా ఉండగా.. రిషబ్ పంత్, అశ్విన్ పుల్ ఫిట్‌నెస్‌తో లేరు. మిగిలిన వాళ్లు ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఇప్పటి వరకు స్పూర్తిదాయక ప్రదర్శన చేసిన టీమ్ఇండియా.. నాలుగో టెస్టు తుది జట్టు కూర్పుపైనే అందరిలో ఆసక్తి నెలకొంది.