Year Ender 2024 : ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ 11 మంది టీమిండియా స్టార్‌ క్రికెటర్లు వీరే..!

జూన్ 9, 2024 భారతీయ క్రికెట్‌ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజున రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

By Medi Samrat  Published on  24 Dec 2024 9:00 AM IST
Virat Kohli, R Ashwin, Cricket Legends, retire, BCCI, Year Ender 2024

Year Ender 2024 : ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ 11 మంది టీమిండియా స్టార్‌ క్రికెటర్లు వీరే..! 

జూన్ 9, 2024 భారతీయ క్రికెట్‌ అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజున రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఓ వైపు దేశమంతా విజయోత్సవ సంబరాల్లో మునిగితేలుతుండగా.. మరోవైపు విరాట్ కోహ్లీ టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్న కొద్దిసేపటికే.. కెప్టెన్ రోహిత్ కూడా టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత జడేజా కూడా ఇద్దరి బాటలోనే నడిచి మరుసటి రోజు తన T20 రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ముగ్గురు దిగ్గజాల నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

అలాగే.. ఈ పదవీ విరమణ ప్రక్రియ ఇక్కడితో ఆగలేదు.. చాలా మంది ఆటగాళ్ళు ఏడాది పొడవునా వివిధ ఫార్మాట్లలో రిటైర్ అయ్యారు. 2024 సంవత్సరంలో భారత క్రికెటర్ల రిటైర్మెంట్ జాబితాను తెలుసుకుందాం.

1. రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత జూన్ 29న టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ఇదే నా చివరి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అని అన్నాడు. ఈ ఫార్మాట్‌కి వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్‌ 62 మ్యాచ్‌లు ఆడింది. అందులో భారత్ 50 మ్యాచ్‌లు గెలిచింది, 12 మ్యాచ్‌లు ఓడిపోయింది.

2. విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీని తర్వాత అతను వేడుకలో మాట్లాడుతూ.. ఇదే నా చివరి టీ20 ప్రపంచకప్.. ఇదే మేము సాధించాలనుకున్నాం.. ఇప్పుడు కొత్త తరం ఆ బాధ్యత తీసుకుంటుంది. అలాగే యువ ఆటగాళ్లు కూడా అదే విధంగా భారత జెండాను రెపరెపలాడిస్తారన్న నమ్మకం ఉందని కోహ్లీ అన్నాడు.

3. రవీంద్ర జడేజా

రోహిత్-విరాట్ T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన సమాచారం ఇస్తూ.. నేను టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను. ఇతర ఫార్మాట్లలో నా ప్రదర్శనను కొనసాగిస్తాను అని పేర్కొన్నాడు.

4. దినేష్ కార్తీక్

దినేష్ కార్తీక్ తన పుట్టినరోజున టీ20కి రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్‌పై కొంతకాలం ఆలోచన‌లో ఉన్న కార్తీక్‌.. నేను రిప్రజెంటేటివ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను అని అతను ఒక పోస్ట్‌లో రాశాడు. తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ.. అతను ఒక వీడియోను కూడా పంచుకున్నాడు, అందులో అతను బాల్యం నుండి కెరీర్ వరకు ప్రత్యేకమైన క్షణాలను చూపించాడు. రిటైర్మెంట్‌ తర్వాత దినేష్ కార్తీక్ వ్యాఖ్యాత‌గా కనిపించ‌నున్నాడు.

5. శిఖర్ ధావన్

ఆగస్ట్ 24న శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 87 సెకన్ల వీడియోను షేర్ చేస్తూ.. ధావన్ తన ఇద్దరు చిన్ననాటి కోచ్‌లతో పాటు తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. కథలో ముందుకు వెళ్లాలంటే పేజీలు తిరగేయాల్సిందే అని రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు.

6. వృద్ధిమాన్ సాహా

4 నవంబర్ 2024న, వృద్ధిమాన్ సాహా క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2014లో ధోని టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత సాహా భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. అతను చివరిసారిగా 2021లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి జట్టులో చోటు దక్కలేదు. కోచ్ ద్రవిడ్ తనను రిటైర్ అవ్వాలని కోరాడని సాహా చెప్పాడు. అదే సమయంలో.. గంగూలీ తనను జట్టులో ఉంచుతానని తప్పుడు వాగ్దానం చేశాడని కూడా ఆరోపించాడు.

7. కేదార్ జాదవ్

3 జూన్ 2024న కేదార్ జాదవ్ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. 3 గంటల నుండి నేను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయినట్లు భావించాలని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తరహాలో జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

8. ఆర్ అశ్విన్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు మ్యాచ్ డ్రా అయిన త‌ర్వాత సిరీస్ మ‌ధ్య‌లో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆపై మరుసటి రోజు చెన్నైలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. 106 టెస్టుల్లో 537 వికెట్లు తీశాడు.

9. సౌరభ్ తివారీ

సౌరభ్ తివారీ 2024లో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సౌరభ్ వన్డేలో 3 మ్యాచ్‌లు ఆడి 49 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 37 నాటౌట్. అయితే సౌరభ్‌కు ఫస్ట్ క్లాస్ కెరీర్ బలంగా ఉంది. 2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సౌరభ్ కూడా ముఖ్యమైన ఆట‌గాడు.

10. బరిందర్ స్రాన్

31 ఏళ్ల వయసులోనే బరీందర్ స్రాన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బరీందర్ జనవరి 2016 నుంచి జూన్ 2016 మధ్య భారత్‌ తరపున 6 ODIలు, 2 T20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఆ తర్వాత అతడు జట్టుకు దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో కూడా అతనికి అవకాశం లభించలేదు. దీంతో అతడు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

11. వరుణ్ ఆరోన్

2008లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వరుణ్ ఆరోన్ 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 65 రంజీ మ్యాచ్‌లు ఆడిన వరుణ్ ఆరుసార్లు ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. రిటైర్మెంట్ ప్రకటిస్తూ.. నేను 2008 నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నానని.. నేను వేగంగా బౌలింగ్ చేశానని.. అందుకే నాకు ఎక్కువ‌గా గాయాలయ్యాయని చెప్పాడు.

ఈ ఫార్మాట్‌లో వేగంగా బౌలింగ్ చేయడానికి నా శరీరం అనుమతించట్లేద‌ని నేను అర్థం చేసుకున్నాను.. అందుకే నేను క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు

Next Story