యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు.. కులాలను కించపరిచే విధంగా మాట్లాడడంతో..!

Fresh Controversy Over Yuvraj Singh Remarks On Yuzvendra Chahal. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు.

By Medi Samrat  Published on  15 Feb 2021 12:51 PM IST
Fresh Controversy Over Yuvraj Singh

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. యువీపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద హర్యానా పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. ఓ లాయర్ ఇచ్చిన ఫిర్యాదులో హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్ ఉన్నతాధికారులు, విచారణ జరిపి, ప్రాథమిక సాక్ష్యాలున్నాయని నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు. యువరాజ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) (ఎస్) కింద కేసు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.

యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, నిమ్న కులాలను లక్ష్యం చేసుకుంటూ ఆయన మాట్లాడారని అంటూ, ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై లాక్ డౌన్ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్ లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు, కేసును నమోదు చేశారు.


గత సంవత్సరం జూన్ లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్ లో పాల్గొన్న యువరాజ్, మరో ఆటగాడైన యజువేంద్ర చాహల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఓ సామాజిక వర్గం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చాడు యువరాజ్. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరాడు. అయినా కూడా అతడిని ఇప్పుడు కేసులు వెంటాడుతూ ఉన్నాయి.


Next Story