ఫైన‌ల్‌కు దూసుకువెళ్లిన ఫ్రాన్స్‌.. షాపుల‌కు నిప్పుపెట్టిన మొరాకో అభిమానులు

France into final with 2-0 win as Morocco go down fighting.ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 2:39 AM GMT
ఫైన‌ల్‌కు దూసుకువెళ్లిన ఫ్రాన్స్‌.. షాపుల‌కు నిప్పుపెట్టిన మొరాకో అభిమానులు

ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ దుమ్ములేపింది. మొరాకోపై 2-0 తేడాతో విజ‌యం సాధించి వ‌రుస‌గా రెండో సారి ఫైన‌ల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన ఫ్రాన్స్ ఈ టోర్నీలో అంచ‌నాల‌కు త‌గ్గట్లుగా రాణిస్తూ ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఫ్రాన్స్ త‌ల‌ప‌నుంది.

మ్యాచ్ ఆరంభ‌మైన 5వ నిమిషంలోనే థియో హెర్నాండెజ్ గోల్ సాధించడంతో ఫ్రాన్స్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కావ‌డంతో ఇరు జ‌ట్లు నువ్వా నేనా అన్న‌ట్లుగా త‌ల‌ప‌డ్డాయి. మొరాకో ఆట‌గాళ్లు గోల్ చేసేందుకు ఎంత‌గా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి ఫ్రాన్స్ డిఫెండ‌ర్లు వారికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో తొలి అర్థ‌భాగంలో మ‌రో గోల్ న‌మోదు కాలేదు.

రెండో అర్థ‌భాగంలోనూ ఇరు జ‌ట్లు గోల్ చేసేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశాయి. 76వ నిమిషంలో సూప‌ర్ స‌బ్ రాండ‌ల్ కోలో మునానీ ఫ్రాన్స్‌కు మ‌రో గోల్ అందించాడు. దీంతో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లిన ఫ్రాన్స్ మ్యాచ్ ముగిసే వ‌ర‌కు త‌మ ఆధిక్యాన్ని నిల‌బెట్టుకుంది. ఫ‌లితంగా మ్యాచ్ గెలిచి ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. దీంతో ఫ్రాన్స్ దేశంలో సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి.

మొరాకో అభిమానుల విధ్వంసం..

త‌మ జ‌ట్టు ఓడిపోవ‌డాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. బ్ర‌స్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. సౌత్ స్టేష‌న్ స‌మీపంలోని పోలీసుల‌పై బాణాసంచాల‌ను విసిరారు. ప‌లు దుకాణాల‌ను నిప్పంటించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని చెద‌ర‌గొట్టేందుకు టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌మోగించారు.

Next Story
Share it