హెచ్‌సీఏ గత పాలకవర్గంపై.. ఒకేసారి నాలుగు కేసులు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు నమోదు అయింది.
By అంజి Published on 19 Oct 2023 12:01 PM IST
హెచ్‌సీఏ గత పాలకవర్గంపై.. ఒకేసారి నాలుగు కేసులు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ పై కేసు నమోదు అయింది. హెచ్‌సీఏ గత పాలకవర్గం అవినీతికి పాల్పడిందని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో సామాగ్రి కొనుగోళ్ల టెండర్లలో అవకతవకలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అగ్నిమాపక, జిమ్‌సామాగ్రి, క్రికెట్ బంతులు, బకెట్‌కుర్చీల కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు.. హైదరాబాద్ క్రికెట్ సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీల్ కంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019- 2022 మధ్య అపెక్స్ కౌన్సిల్ ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.
బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్, వాటిని ఖర్చు చేసిన విధానం, టెండర్లు, కొటేషన్లు వంటి వాటిలో అవకతవకలు జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ గుర్తించి ఫిర్యాదు చేసిందని తెలిసింది. హెచ్‌సీఏ గత పాలకవర్గం అధ్యక్షుడిగా అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజన్, కార్యదర్శిగా విజయానంద్, సంయుక్త కార్యదర్శిగా నరేష్ శర్మ, ట్రెజరర్‌గా సురేందర్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్నారు. పోలీసులు ఫోర్జరీ, కుట్ర, నమ్మకద్రోహం, మోసం సెక్షన్లు నమోదు చేశారు. సుమారు రూ.20 కోట్ల వరకూ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. సునీల్ కంటే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామాగ్రి సరఫరా చేసిన వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.