ప్రపంచ కప్ రేసు నుండి వెస్టిండీస్ ఔట్..!

Former world champions West Indies fail to qualify for 2023 World Cup in India. 1975, 1979లో తొలి రెండు ప్రపంచకప్‌లను కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు దీనావస్థలో కొనసాగుతోంది.

By Medi Samrat  Published on  1 July 2023 8:37 PM IST
ప్రపంచ కప్ రేసు నుండి వెస్టిండీస్ ఔట్..!

1975, 1979లో తొలి రెండు ప్రపంచకప్‌లను కైవసం చేసుకున్న వెస్టిండీస్ జట్టు దీనావస్థలో కొనసాగుతోంది. వచ్చే ప్రపంచకప్‌లో ఆ జ‌ట్టు కనిపించదు. ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన పోరులో ఓటమితో వారు వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయింగ్ రేసు నుంచి దాదాపు నిష్ర్కృమించింది. శనివారం (జూలై 1) జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో తొలిసారి విండీస్ జ‌ట్టు లేకుండా ప్రపంచకప్ జ‌రుగుతుంది.

క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్, మైఖేల్ హోల్డింగ్, మాల్కం మార్షల్, కోర్ట్నీ వాల్ష్, బ్రియాన్ లారా, శివనారాయణ్ చంద్రపాల్, క్రిస్ గేల్ వంటి దిగ్గాజాలు ఆడిన వెస్టిండీస్ జట్టు.. భవితవ్యాన్ని చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్ తొలిసారి స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు పేలవమైన ఆరంభం లభించింది. ఆ జట్టులో షమర్ బ్రూక్స్ (0), బ్రాండ్ కింగ్ (22), కెప్టెన్ షాయ్ హోప్ (13), కైల్ మేయర్స్ (5), నికోలస్ పూరన్ (21) ఒక‌రి త‌ర్వాత పెవిలియన్ బాట‌ పట్టారు. ఒక దశలో వెస్టిండీస్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే.. జాసన్ హోల్డర్, రోమన్ షెపర్డ్ 77 పరుగుల భాగస్వామ్యంతో వెస్టిండీస్‌ను 181 స్కోరుకు తీసుకెళ్లారు.

అనంత‌రం స్కాట్లాండ్ 43.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో స్కాట్లాండ్ సూపర్ సిక్స్‌లో మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఐదో స్థానంలో ఉంది. విండీస్‌కు మ‌రో రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. అయినా టోర్నీ నుంచి దాదాపు వైదొలిగిన‌ట్లేన‌ని ఐసీసీ ట్వీట్‌లో వెల్ల‌డించింది. వ‌ర‌ల్డ్ క‌ప్ అర్హ‌త సాధించే టీమ్‌లు ఏవో తెలియాలంటే.. జులై 9 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



Next Story