ప్రపంచకప్-2023లో భాగంగా అక్టోబరు 15న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే రసాభాస పర్వం మొదలైంది. తాజాగా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో పాక్ జట్టు ఫేవరెట్ అని అతను అభిప్రాయపడ్డాడు. భారత బౌలింగ్ పాక్ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం సవాలు విసరలేదని అజ్మల్ అభిప్రాయపడ్డాడు. భారత బౌలింగ్ బలహీనంగా ఉందని వ్యాఖ్యానించాడు.
భారత బౌలింగ్.. పాకిస్థాన్ పదునైన బౌలింగ్‌లా ఎప్పుడూ లేదని అన్నాడు. భారత బౌలింగ్ లైనప్ ఎప్పుడూ బలహీనంగానే ఉందని అన్నారు. ఈ మధ్య కాలంలో సిరాజ్ మాత్రమే బాగా బౌలింగ్ చేస్తున్నాడు. షమీ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా ప్రపంచకప్‌లో కీలక బౌలర్‌డా ఉంటాడని భావిస్తున్నాను. జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్‌కు ముప్పుగా మారవచ్చు, కానీ అతను చాలా కాలంగా అన్‌ఫిట్‌గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బౌలింగ్ వల్ల పాకిస్థాన్‌కు పెద్దగా ముప్పు వాటిల్లుతుందని భావించడం లేదని అన్నాడు.
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌ను అంచనా వేస్తూ.. తమ జట్టు గెలిచే అవకాశాలు 60 శాతం ఉన్నాయని అజ్మల్ చెప్పాడు. భారత్ బ్యాటింగ్ ఎప్పుడూ బలంగానే ఉంది. మా బౌలింగ్ ప్రమాదకరం. దీంతో పోరు హోరాహోరీగా ఉంటుందని అన్నారు. భారత పరిస్థితులు, పాకిస్థాన్‌కు ఉన్న బౌలర్ల దృష్ట్యా భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేస్తే పాక్ విజయం సాధిస్తుందని అన్నాడు. ఇదిలావుంటే.. వన్డే ప్రపంచకప్ లో భారత్‌ను పాకిస్థాన్ ఎన్నడూ ఓడించలేదు. ఇరు జట్లు మొత్తం ఏడుసార్లు తలపడగా.. మ్యాచ్‌లన్నీ భారత్ గెలవడం విశేషం.