ఒకప్పటి కివీస్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెరాలోని హాస్పిటల్‌లో కెయిన్స్‌కు చికిత్స అందిస్తున్నారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనిలో చీలిక రావడంతో కొన్ని రోజుల కిందట కుప్పకూలిపోయాడు కెయిన్స్. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కెయిన్స్‌కు పలు శస్త్ర చికిత్సలు చేసినా ఆరోగ్యం మెరుగుపడలేదని..కృత్రిమ శ్వాస అందించాల్సిన పరిస్థితి తలెత్తిందని వైద్యులు తెలిపారు.
విషయం తెలిసిన అతడి అభిమానులు.. కెయిన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా.. 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు చేయడంతో పాటు 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు చేయడంతో పాటు 201 వికెట్లు పడగొట్టాడు.టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు కెయిన్స్.