వెస్టిండీస్ జట్టును కరోనా మహమ్మారి వెంటాడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆ జట్టు బృందంలో మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వారంతా ఐసోలేషన్‌లోకి వెళ్లారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు కాగా.. మరో ఇద్దరు కోచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. బ్యాట్స్‌మెన్ షాహి హోప్, స్పిన్నర్ అకీల్ హుసేన్, ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ తో పాటు అసిస్టెంట్ కోచ్ రొడ్డి ఎస్ట్‌విక్, టీమ్ ఫిజీషియన్ డాక్టర్ అక్సాయి మాన్‌సింగ్ లు కరోనా బారిన పడినట్లు ట్వీట్ చేసింది.
వీరంతా పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారని.. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే జట్టుతో కలుస్తారని వెల్లడించింది. అంతకముందు రోస్టన్ చేజ్, కైల్ మేయర్స్, షెల్డన్ కాట్రెల్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో పాకిస్థాన్ 2-0 ఆధిక్యంలో ఉండగా.. నేడు ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఈ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక శనివారం నుంచి వన్డే సిరీస్ కూడా ప్రారంభం కానుండడంతో.. మ్యాచ్‌లను నిర్వహించాలా వద్దా అన్న దానిపై వెస్టిండీస్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు సమావేశం అయి ఓ నిర్ణయం తీసుకోనున్నాయి.