కోహ్లీ కంటి ద‌గ్గ‌ర గాయం.. ఎర్ర‌గా మారిన క‌న్ను.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

Fans Worried as Virat Kohli Gets Hit Under Eye.ఐపీఎల్ 14వ సీజ‌న్ లో తొలి మ్యాచ్ అంద‌రికి సూప‌ర్ కిక్కు ఇచ్చింది. ముంబై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2021 9:01 AM IST
కోహ్లీ కంటి ద‌గ్గ‌ర గాయం.. ఎర్ర‌గా మారిన క‌న్ను.. ఆందోళ‌న‌లో అభిమానులు..!

ఐపీఎల్ 14వ సీజ‌న్ లో తొలి మ్యాచ్ అంద‌రికి సూప‌ర్ కిక్కు ఇచ్చింది. ముంబై ఇండియ‌న్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు విజ‌యం కోసం చివ‌రి బంతి వ‌ర‌కు పోరాడాయి. చివ‌ర‌కు రెండు వికెట్ల తేడాతో బెంగళూరు జ‌ట్టు విజ‌యం సాధించింది. అయితే.. ముంబై బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ గాయ‌ప‌డ్డాడు. ముంబై ఇన్నింగ్స్ 19వ ఓవ‌ర్‌లో తొలి బంతిని ముంబై బ్యాట్స్‌మెన్ కృనాల్ చాలా బ‌లంగా బాదాడు. ఆ బంతిని క్యాచ్ అందుకునే క్ర‌మంలో కోహ్లీ కంటి ద‌గ్గ‌ర బాల్ తాకింది. తొలుత చేతిని తాకిన బాల్, ఆపై నుదుటిపై కుడికన్ను సమీపంలో తాకింది.

కంటి ద‌గ్గ‌ర‌గా బాల్ తాక‌డంతో కొద్ది సేపు కోహ్లీ బాధ‌తో విల‌విల‌లాడాడు. కోహ్లీ ముఖంపై తగిలిన దెబ్బ కారణంగా, అతని కన్ను ఎర్రగా మారిపోయింది. కంటి నుంచి నీరు కారుతుండ‌డం లైవ్‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో బెంగ‌ళూరు అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అయినా నొప్పిని భ‌రిస్తూనే కోహ్లీ ఫీల్డింగ్ చేశాడు. ముంబై ఇన్నింగ్స్ ముగిసిన తరువాత నవ్వుకుంటూనే పెవిలియన్ కు వెళ్లిన కోహ్లీ, ఆపై బ్యాటింగ్ కు వచ్చాడు. 29 బంతుల్లో 4 పోర్ల సాయంతో 33 ప‌రుగులు చేశాడు. కాగా.. కోహ్లీ అయిన గాయం పెద్ద‌ది కాద‌ని.. త‌దుప‌రి మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని బెంగ‌ళూరు మేనేజ్‌మెంట్ స్ప‌ష్టం చేసింది. కోహ్లీ కన్ను ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారుతున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన బెంగుళూరు బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన‌ ముంబయి ఇండియన్స్ 20 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగులు చేసింది.‌ ముంబై ఆట‌గాళ్ల‌లో క్రిస్‌లిన్ 49, సూర్యకుమార్‌ యాదవ్ 31, ఇషన్ కిషన్ 28 ప‌రుగులు చేశారు. ఇక‌ బెంగళూరు బౌలర్లలో హ‌ర్షాల్ పటేల్ 5 వికెట్లు తీయ‌గా, వాషింగ్టన్ సుందర్, జెమిసన్ చెరో వికెట్ తీశారు.అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లు ప్రారంభించారు.

వాషింగ్టన్ సుంద‌ర్ 10 పరుగుల వ‌ద్ద‌ ఆవుట్ కాగా.. విరాట్ కోహ్లీ 33 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ 39 పరుగులు, ఏబీ డివిలియర్స్ 47 పరుగులు చేసి రాణించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జ‌ట్టు 8 వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక‌ ముంబై బౌలర్ల‌లో బూమ్రా 2, జానే సన్స్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బోల్ట్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీశారు.





Next Story