ఛాంపియన్స్ ట్రోఫీకి దుబాయ్ వెళ్లే క్రికెటర్లు వారి భార్యలను తీసుకెళ్లలేరు.. స్టార్ ప్లేయర్ చేసిన పని వల్లే కొత్త రూల్స్..!
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత BCCI భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
By Medi Samrat Published on 14 Feb 2025 9:02 AM IST
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత BCCI భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో ఒకటి.. ఇప్పుడు ఒక క్రికెటర్ విదేశీ పర్యటనకు 150 కిలోల కంటే ఎక్కువ లగేజీని తీసుకువెళితే.. BCCI విమానయాన సంస్థలకు అదనపు ఛార్జీలను చెల్లించదు. దీనికి అయ్యే ఖర్చును ఆటగాడే భరించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా టూర్‌లో ఓ స్టార్ ప్లేయర్ 27 బ్యాగ్‌లు తీసుకెళ్లాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా ఓ స్టార్ ఆటగాడు తన వెంట 27 బ్యాగులు, ట్రాలీ బ్యాగ్‌లను తీసుకెళ్లాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అతని సామాను మొత్తం బరువు 250 కిలోల కంటే ఎక్కువ. ఈ లగేజీలో 17 బ్యాట్‌లు.. క్రికెటర్‌తో పాటు అతని వ్యక్తిగత సిబ్బంది.. కుటుంబ సభ్యుల బ్యాగులు కూడా ఉన్నాయి. వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యుల బ్యాగులను విడివిడిగా తీసుకెళ్లాలి.. అయితే వీటిని బీసీసీఐ చెల్లించేలా స్టార్ క్రికెటర్ లగేజీలో చేర్చారని వెల్లడించారు. భారత్ నుండి ఆస్ట్రేలియాకు, ఆస్ట్రేలియాలోని ఒక నగరం నుండి మరొక నగరానికి.. తిరిగి భారతదేశానికి.. ఆ లగేజీ అంతా BCCI ఖర్చుతో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయబడింది. దీనికి ఎంత ఖర్చయిందనే దానిపై బీసీసీఐ అధికారి సమాచారం ఇవ్వనప్పటికీ, బోర్డు మాత్రం లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ క్రికెటర్‌ని చూసిన ఇతర ఆటగాళ్లు కూడా అదే చేయడం ప్రారంభించారు. దీంతో BCCI కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రతి ఆటగాడు విదేశీ పర్యటనలకు 150 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇది కాకుండా.. క్రికెటర్ అదనపు లగేజీని తీసుకొస్తే.. వాటి ఛార్జీలను అతడే విమానయాన సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆటగాళ్లందరూ టీమ్ బస్సులో మాత్రమే వెళ్లాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ నిర్ణయంతో ఇటీవల తొలి టీ20 మ్యాచ్ కోసం కోల్‌కతా చేరుకున్న భారత జట్టు ఆటగాళ్లంతా ఒకే బస్సులో స్టేడియం, హోటల్‌కు వెళ్లారు. జట్టులో ఐక్యతను కొనసాగించేందుకు.. బీసీసీఐ ఎంత పెద్ద ఆటగాడైనా విడిగా వెళ్లకూడదని నిర్ణయించింది.
ఈ టోర్నమెంట్ ద్వారా బీసీసీఐ కొత్త ట్రావెల్ పాలసీని తొలిసారిగా అమలు చేస్తున్నందున భారత క్రికెట్ ఆటగాళ్ల భార్యలు, కుటుంబాలు ఛాంపియన్స్ ట్రోఫీకి వారితో పాటు వెళ్లడం కుదరదు. ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్.. ఫైనల్ మార్చి 9న జరుగుతుంది. ఈ పర్యటన మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలోనే పూర్తవుతుంది. అయినా కూడా ఆటగాళ్ల కుటుంబాలను వారితో పాటు వెళ్లడానికి BCCI అనుమతించదు.
కొత్త రూల్స్ ప్రకారం.. కుటుంబాలు 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ టూర్‌లలో మాత్రమే గరిష్టంగా రెండు వారాల పాటు ఆటగాళ్లతో పాటు వెళ్లవచ్చు. బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. 'ఏదైనా మారితే అది వేరే విషయం.. కానీ ప్రస్తుతం ఆటగాళ్ల కుటుంబాలు వారితో వెళ్లడం లేదు.. దీనిపై ఓ సీనియర్ ఆటగాడు అడగ్గా కొత్త విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు.
BCCI పాలసీ ప్రకారం.. 'ఒక ఆటగాడు 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు విదేశీ పర్యటనలో భారత్‌కు దూరంగా ఉంటే, అతని భార్య, పిల్లలు (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు) గరిష్టంగా రెండు వారాల పాటు అతనితో పాటు వెళ్లవచ్చు. ఈ విధానం నుండి ఏదైనా సడలింపు కావాలంటే.. కోచ్, కెప్టెన్, GM కార్యకలాపాల నుండి అనుమతి అవసరం. ఇందుకు తప్ప మరే విషయంలోను అయ్యే ఖర్చులను బీసీసీఐ భరించదు.