ఇంగ్లాండ్ అభిమానుల అతి.. మొన్న రాహుల్‌పై బాటిల్ మూత‌లు.. నేడు సిరాజ్ పై బంతి

English crowd throw ball at Mohammed Siraj.ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2021 7:37 AM GMT
ఇంగ్లాండ్ అభిమానుల అతి.. మొన్న రాహుల్‌పై బాటిల్ మూత‌లు.. నేడు సిరాజ్ పై బంతి

ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. అయితే.. ఈ సారి ఇంగ్లాండ్ అభిమానులు కాస్త అతి చేస్తున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్‌లో సెంచ‌రీతో మ్యాచ్‌ను భార‌త్ వైపు మొగ్గు చూపేలా చేసిన కేఎల్ రాహుల్ పై వాటర్‌ బాటిల్ మూత‌ల‌ను విసిరిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క ముందే.. మూడో టెస్టు తొలి రోజు సిరాజ్‌ను ల‌క్ష్యంగా చేసుకుని బంతిని విసిరారు. అంతేకాకుండా స్కోర్ ఎంత అంటూ గేలిచేసే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌గా.. సిరాజ్ మాత్రం అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఆరంభించ‌గా.. ఇంగ్లాండ్ బౌల‌ర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త టాప్, మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. అనంత‌రం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ తొలి రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 120 ప‌రుగులు చేసింది. దీంతో 42 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండ‌గా.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈక్ర‌మంలో అభిమానుల్లో ఎవ‌రో బంతిని విసిరారు. ఇది చూసిన కెప్టెన్ కోహ్లీ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ఆ బంతిని తిరిగి వారి వైపే విసిరి వేయాల‌ని సిరాజ్‌కు సైగ చేశాడు. ఈ క్ర‌మంలో కొంద‌రు అభిమానులు మ‌రింత రెచ్చ‌గొట్టే విధంగా స్కోరెంత అని సిరాజ్‌ను ప్ర‌శ్నించారు. దీనికి సిరాజ్ చాలా తెలివిగా బ‌దులు ఇచ్చాడు. 1-0 అని సిరీస్‌లో టీమ్ఇండియా ఆధిక్యం గురించి సైగ‌లు చేస్తూ దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు.

సిరాజ్‌పై బంతి విసిరిన ఘ‌ట‌న‌పై పంత్ మీడియా స‌మావేశంలో మాట్లాడాడు. ఎవ‌రో సిరాజ్‌పై బంతి విసిరారు. దీనిపై కోహ్లి అసంతృప్తి వ్య‌క్తం చేసిన మాట నిజ‌మేన‌ని చెప్పాడు. మీరు ఏం అనాల‌నుకుంటే అది అనండి. కానీ ఫీల్డ‌ర్ల‌పై ఇలా వ‌స్తువుల‌ను విస‌ర‌కండి. అది క్రికెట్‌కు మంచిది కాదు అని పంత్ వ్యాఖ్యానించాడు.

Next Story
Share it