IND Vs ENG: తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ టీమ్‌ గెలిచింది.

By Srikanth Gundamalla  Published on  28 Jan 2024 6:15 PM IST
england, won, first test match,  india,

 IND Vs ENG: తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం 

భారత్‌ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లు టెస్టు సిరీస్‌ ఆడుతున్నాయి. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగుతాయి. అయితే.. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ టీమ్‌ గెలిచింది. 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన 202 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బ్యాటర్లలో ఎవరూ హాఫ్‌ సెంచరీ చేయలేకపోయారు. మరొక రోజు మిగిలి ఉండగానే తొలి టెస్టు పూర్తయింది. భారత్‌పై ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ టీమ్‌లో టామ్‌ హార్ట్‌లే ఏకంగా 7 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టీమిండియాలో రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (39), అశ్విన్ (28), శ్రీకర్ భరత్ (28), కేఎల్ రాహుల్ (22) పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యారు. అయితే.. చివరన వచ్చిన బూమ్రా, సిరాజ్‌లు కాసేపు క్రీజులో నిలబడ్డారు. నాలుగో రోజు ఆటను పూర్తి చేస్తారేమో అన్నట్లు కనిపించారు. మంచి సమన్వయంతో కొన్ని పరుగులు చేశారు. సిరాజ్‌ ఏకంగా రెండు బౌండరీలను చేశాడు. చివరకు టామ్‌ హార్ట్‌లే వేసిన బంతిని ముందుకు వచ్చి పెద్ద షాట్ ఆడబోయాడు.. మిస్‌ అవ్వడంతో వికెట్‌ కిపర్‌ స్టంప్‌ అవుట్ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కూడా శుభ్‌మన్‌ గిల్‌ రాణించలేకపోయాడు. అతను రెండు బంతులను మాత్రమే ఎదుర్కొని ఒక్క పరుగు చేయకుండా అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో టామ్‌ హార్ట్‌లే 7 వికెట్లు, జోరూట్‌, జాక్‌ లీచ్‌ చెరో వికెట్‌ తీశారు.

ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్ 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌ 420 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్ 436 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఇక రెండు టీమ్‌ మధ్య ఐదు టెస్టుల్లో భాగంగా.. రెండో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6 వరకు కొనసాగనుంది. ఈ మ్యాచ్‌ విశాఖపట్నంలో జరగనుంది.

Next Story