భారత్, ఇంగ్లండ్‌ ఐదో టెస్టు జరుగుతుందా? లేదా?

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 March 2024 11:39 AM IST
england vs india, cricket, test match, dharamshala,

భారత్, ఇంగ్లండ్‌ ఐదో టెస్టు జరుగుతుందా? లేదా?

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది. ఇప్పటికే ఈ టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 1-3 తేడాతో భారత్‌ ఈ టెస్టు సిరీస్‌ను గెలిచింది. ఇక చివరి టెస్టు మ్యాచ్‌ నామమాత్రంగానే జరగనుంది. ధర్మశాల వేదికగా మార్చి 7వ తేదీ నుంచి ఈ మ్యాచ్‌ జరుగుతుంది. సిరీస్‌ను చేజార్చుకున్నా కూడా.. చివరి మ్యాచ్‌ గెలుపుతో అయినా సిరీస్‌ను ముగించాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ధర్మశాలకు ఇంగ్లండ్‌ జట్టు ఇప్పటికే చేరుకుంది. ఇండియా టీమ్‌ కూడా సోమవారం అక్కడకు వెళ్తుంది.

ధర్మశాల వేదికగా సాగనున్న ఈ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఆఖరి టెస్టు సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు. దీనికి కారణం ధర్మశాలలో ఉన్న వాతావరణమే. ఐదో టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. మార్చి 3వ తేదీన ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు సమాచారం. ఇవే వర్షాలు రాబోయే రోజుల్లో కూడా ఉండనున్నాయని వాతావరణశాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో చివరి టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందనే విషయం అర్థం అవుతోంది. మరోవైపు వాతావరణం ధర్మశాలలో నిత్యం చల్లగానే ఉంటుంది. చల్లని వాతావరణం కూడా ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్‌గానూ, కనిష్ట ఉష్ణోగ్రత -4 డిగ్రీల కంటే తక్కువగానూ ఉండే ఛాన్స్‌ ఉంది. హిమపాతం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు రాణించారు. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఓటమని చూసిన రోహిత్‌ సేన..ఆ తర్వాత వరుసగా మూడింటిలో విజయాలను చూసింది. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. విరాట్‌ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి సీనియర్లు లేకపోయినా అద్బుతంగా రాణించింది. జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, గిల్, ధ్రువ్‌ జురెల్‌లు అద్భత ప్రదర్శన కనబరిచారు. బుమ్రా, కుల్దీప్‌, అశ్విన్‌లు తమ మేజిక్‌ను కొనసాగించారు. ఇక ప్రస్తుతం టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

Next Story