'పీఎస్‌ఎల్‌ కంటే ఐపీఎల్‌ బెటర్‌'.. పాక్ జర్నలిస్ట్‌కు షాకిచ్చిన‌ ఇంగ్లండ్ ఆట‌గాడు..!

ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ పాక్ మీడియాకు షాక్ ఇచ్చాడు.

By Medi Samrat
Published on : 16 April 2025 4:41 PM IST

పీఎస్‌ఎల్‌ కంటే ఐపీఎల్‌ బెటర్‌.. పాక్ జర్నలిస్ట్‌కు షాకిచ్చిన‌ ఇంగ్లండ్ ఆట‌గాడు..!

ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ పాక్ మీడియాకు షాక్ ఇచ్చాడు. పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్ ఉత్తమమని సామ్ బిల్లింగ్స్ అభివర్ణించారు. సామ్ బిల్లింగ్స్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా.. బిల్లింగ్స్‌ను ఒక పాకిస్తానీ జర్నలిస్ట్.. PSL, IPLలో ఏది బెటర్ అని అడిగాడు. బిల్లింగ్స్ రిపోర్టర్‌పై విరుచుకుపడ్డాడు. అతడు వ్యంగ్యంగానే స‌మాధాన‌మిచ్చాడు. నేను ఏదో మూర్ఖత్వంలో స‌మాధానం చెప్పాలనుకుంటున్నావా.? ఐపీఎల్ కంటే ప్రపంచంలోని ఏ లీగ్‌ని అయినా మెరుగ్గా పరిగణించడం కష్టం. అన్ని ఇతర పోటీలు IPL కంటే వెనుకబడి ఉన్నాయి. పీఎస్‌ఎల్‌ను ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ టోర్నీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నార‌ని తెలుసు.. అయితే.. బిగ్ బాష్ లీగ్ కూడా అదే ప్రయత్నంలో ఉందన్నాడు.

ప్రస్తుత PSLలో ఇప్పటివరకు సామ్ బిల్లింగ్స్ ప్రదర్శన అంత‌గా ఆక‌ట్టుకోలేదు. సామ్ బిల్లింగ్స్ లాహోర్ క్వాలండర్స్ తరపున మూడు మ్యాచ్‌లలో 69 పరుగులు చేశాడు. ఇందులో అర్ధ సెంచరీ ఉంది. ఒక్కసారి ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు.

ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ ప్రెస్ మీట్‌ల‌లో భారత్‌ను ప్రస్తావించ‌డం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల, ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను పీఎస్‌ఎల్‌లో ఆడినందుకు భారత అభిమానుల నుండి తనకు వచ్చిన ద్వేషం గురించి మీరు ఏమి చెబుతారని అడిగారు. వార్నర్ బ‌దులిస్తూ.. ఇలాంటి ప్ర‌శ్న‌ మొదటిసారి విన్నాను. నా దృక్కోణంలో నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. ఇక్కడ పీఎస్‌ఎల్‌లో ఆడే అవకాశం వచ్చింది. నా అంతర్జాతీయ క్యాలెండర్ సమయం కారణంగా గ‌తంలో నేను PSLకి రావడానికి కుద‌ర‌లేదు. నేను ఇప్పుడు ఆడాల‌నుకుంటున్నాను. నేను కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాను. మేము ట్రోఫీని గెలుస్తామని ఆశిస్తున్నాము అని బ‌దులిచ్చాడు.

Next Story