తొలి సెషన్‌లో విజృంభించిన బౌలర్లు.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
England lose 4 wickets in first session.నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 4:59 PM IST
నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి సెషన్‌లో భారత బౌలర్ల ధాటికి 27 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ప్రస్తుతం ఒలి పోప్ 1, బెన్ స్టోక్స్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. అశ్విన్, ఇషాంత్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ క్రాలీ (53) మాత్రమే హాఫ్ సెంచరీతో రాణించాడు. సిబ్లీ (0), బెయిర్‌స్టో (0), రూట్ (17) విఫలమయ్యారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ ఆదిలోనే షాకిచ్చాడు. రెండో ఓవర్ మూడో బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన సిబ్లీ స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో రెండు పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ క్రాలే బౌండరీలతో స్కోరును పెంచే ప్రయత్నం చేయగా.. వన్‌డౌన్‌లో బెయిర్ స్టోను అక్షర్ పటేల్ తన తొలి బంతికే పెవిలియన్ చేర్చాడు. ఓ చక్కటి బంతితో బెయిర్ స్టోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 బంతులు ఆడిన బెయిర్ స్టో ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్రాలేకు కెప్టెన్ రూట్ జతకలిశాడు. వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో క్రాలే 67 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.
మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడగొట్టాడు. 17 పరుగులు చేసిన రూట్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు అశ్విన్. రూట్ సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 74 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. మరో వైపు నిలకడగా ఆడుతున్న క్రాలే మరికొద్ది సేపటిలో టీకి వెలుతారనరగా.. అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. క్రాలెను అక్షర్ ఎల్బీగా పెలివియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 80 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.