అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. లంచ్ విరామానికి ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్ స్టో(28), బెన్ స్టోక్స్(24) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ శుభారంభం దక్కలేదు. ఆ జట్టుకు స్పిన్నర్ అక్షర్ పటేల్ షాకిచ్చాడు. వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ సిబ్లీ(2)ని బౌల్డ్ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. మరికొద్ది సేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలేను(9) అక్షర్ పెవిలియన్ చేర్చాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్రాలే షాట్ ఆడగా.. మహ్మద్ సిరాజ్ క్యాచ్ పట్టడంతో అతడు పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఆదుకుంటాడుకున్న కెప్టెన్ జో రూట్(5)ను సిరాజ్ బుట్టలో వేశాడు.13వ ఓవర్ తొలి బంతికి రూట్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో బెన్‌స్టోక్స్, జానీ బెయిర్ స్టో జంట ఇంగ్లాండ్‌ను ఆదుకుంది. ఈ ఇద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. తొలి సెషన్‌లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 44 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.