తొలి టెస్టులో ఘోర పరాభవం.. 227 పరుగుల భారీ తేడాతో ఓటమి
England crush India by 227 runs in 1st Test to take 1-0 lead.చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2021 2:01 PM ISTచెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. 420 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 192 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (72), శుభ్‌మన్ గిల్ (50) లు మాత్రమే ఓ మోస్తారుగా రాణించగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలం కావడంతో ఇంగ్లాండ్ 227 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 13 నుంచి ఇదే గ్రౌండ్‌లో జరగనుంది.
వికెట్ నష్టానికి 39 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 153 పరుగులు జోడించి మిగతా 9 వికెట్లు కోల్పోయింది. ఆఖరి రోజు ఆట ప్రారంభమైన కాసేపటి వరకు ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న నయావాల్ పుజారా(15) ను స్పిన్నర్ లీచ్ బోల్తా కొట్టించాడు. లీచ్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి నయావాల్ పెలివిలియన్ చేరాడు. దీంతో 58 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఇక ఇన్నింగ్స్ బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ భుజాన వేసుకున్నారు. వీరిద్దరు వీలుచిక్కనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. ఈ క్రమంలో గిల్ అర్థశతకం పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోర్ 92 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. గిల్-కోహ్లీ జోడి మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించారు.
ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించడంతో భారత్ వేగంగా వికెట్లు కోల్పోయింది. అజింక్యా రహానే(0), రిషబ్ పంత్(11), వాషింగ్టన్ సుందర్(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమ్ఇండియా 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఆల్‌రౌండర్ అశ్విన్(9)తో కలిసి ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. ఏడో వికెట్‌కు 54 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని లీచ్ విడగొట్టాడు. అశ్విన్ ఔట్ చేయడం ద్వారా భారత పరాజయానికి బాటలు పరిచాడు. ఆ వెంటనే విరాట్ ను బెన్‌స్టోక్స్ బౌల్డ్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ నాలుగు, అండర్సన్ మూడు, బెస్, స్టోక్స్, ఆర్చర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 337, రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయింది.