ఐసీసీకి ఈసీబీ లేఖ.. ఐదో మ్యాచ్‌పై ఏం చేయాలి
England cricket board writes letter to ICC.భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దు అయిన
By తోట వంశీ కుమార్ Published on 12 Sept 2021 2:13 PM ISTభారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉండడంతో ఈసీబీ(ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు)కు లేఖ రాసింది. ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. భారత్ గెలిస్తే.. 3-1తో సిరీస్ దక్కుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే.. 2-2తో సమం అవుతుంది. డ్రా అయితే.. 2-1తో భారత్ గెలుస్తుంది. ఈ విషయంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటిస్తే.. అందుకు తగినట్లుగా తాము ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని చెప్పింది. ఈ మ్యాచ్ రద్దు కారణంగా ఈసీబీ 40 మిలియన్ పౌండ్ల నష్టపోయినట్లు లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ సాయం చేయాలని కోరింది.
రీషెడ్యూల్ కోసం రంగంలోకి గంగూలీ..!
ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దు చేయడంతో.. ఈసీబీకి భారీ నష్టం వాటిల్లనుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మాత్రం ఈ మ్యాచ్‌ను రీ షెడ్యుల్ చేసేందుకు సుముఖంగానే ఉంది. ఈ విషయమై ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక నేరుగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22న లేదా 23న గంగూలీ ఇంగ్లాండ్ వెళ్లి.. ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మరీ ఈ లోపు ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నా దానిపైనే అందరి దృష్టి నెలకొంది