రూట్‌ భారీ శ‌త‌కం.. రాహుల్‌పైకి బీర్‌ బాటిల్‌ మూతలు

England 391 all out take 27 run lead at stumps on Day 3.భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఫామ్ కోల్పోయి తంటాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Aug 2021 9:49 AM IST
రూట్‌ భారీ శ‌త‌కం.. రాహుల్‌పైకి బీర్‌ బాటిల్‌ మూతలు

భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఫామ్ కోల్పోయి తంటాలు ప‌డ్డ‌ ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అనుకున్న‌ట్లుగానే ఈ సిరీస్‌లో ఫామ్ అందుకున్నాడు. భార‌త బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారాడు. వ‌రుస‌గా రెండో టెస్టులోనూ భారీ శ‌త‌కంతో జ‌ట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్‌పై ప‌ట్టు ఎలా సాధించాలో చూపుతూ.. సెష‌న్ల వారిగా గేర్లు మార్చుతూ త‌మ జ‌ట్టును పై చేయి సాధించేలా చేశాడు. రోజంతా బ్యాటింగ్ చేసిన జో రూట్(321 బంతుల్లో 180 నాటౌట్‌; 18 ఫోర్లు) ఇంగ్లాండ్ కు 27 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 391 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది.

మూడో రోజు ఉద‌యం ఓవ‌ర్‌నైట్ స్కోర్ 119/3 ఆట కొన‌సాగించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అల‌వోక‌గా ప‌రుగులు సాధించారు. జానీ బెయిర్‌స్టో (57) నుంచి చ‌క్క‌ని స‌హ‌కారం అందుకున్న రూట్ ఎద‌రుదాడికి దిగాడు. వీరిద్ద‌రూ భార‌త బౌల‌ర్ల‌ను స‌మర్థ‌వంతంగా ఎదుర్కొన్నారు. నాలుగో వికెట్‌కు నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించాక సిరాజ్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత జోస్‌ బట్లర్‌ (23), మొయిన్‌ అలీ (27) అండతో రూట్ కీల‌క బాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఓ ద‌శ‌లో ఇంగ్లాండ్ 341/5 తో నిలిచింది.

ఈ దశలో వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ బట్లర్‌, మొయిన్‌ అలీతో పాటు సామ్‌ కరన్‌ (0)లను ఔట్‌ చేసి టీమ్‌ఇండియాను పోటీలోకి తెచ్చాడు. అయిన‌ప్ప‌టికి టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి రూట్ భార‌త స్కోర్‌ను దాట‌డంతో పాటు కీల‌కమైన ఆధిక్యాన్ని అందించాడు. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ఇషాంత్ మూడు, ష‌మి రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. తొలి టెస్టులో 9 వికెట్లు తీసిన బుమ్రా.. ఈ ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్టూ తీయ‌లేదు.

రాహుల్‌పైకి బీరు మూతలు

తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో భార‌త్ కు భారీ స్కోర్ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ పై కొంద‌రు ఇంగ్లాండ్ అభిమానులు త‌మ అక్క‌సు వెల్ల‌గ‌క్కారు. ఇన్నింగ్స్‌ 69వ ఓవర్‌లో బౌండ‌రీ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్‌ రాహుల్‌ను టార్గెట్‌ చేస్తూ కొందరు ఆకతాయిలు బీర్‌ బాటిల్‌ మూతలు విసిరారు. ఇది చూసిన రాహుల్‌ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన భారత కెప్టెన్‌ కోహ్లీ వాటిని బయట పడేసి పని మీద దృష్టి పెట్టు అంటూ రాహుల్‌కు సూచించాడు.


Next Story