అదరగొట్టిన కమిన్స్.. 147 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్
England 147 All out in Gabba test.ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభమైంది.
By తోట వంశీ కుమార్ Published on 8 Dec 2021 11:10 AM GMTఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. గబ్బా వేదికగా నేడు ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ జట్టు కుప్పకూలింది. బ్యాట్స్‌మెన్ల వైఫల్యంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్(5/38) తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అతడికి తోడు మిచెల్ స్టార్క్(2/35), హేజిల్‌వుడ్(2/42), గ్రీన్(1/6) లు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు తొలి బంతికే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోరీ బర్న్స్(0)ను మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ పరుగుల ఖాతా తెరవకముందే తొలి వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ హాసీబ్ హామీద్(25; 75 బంతుల్లో 3పోర్లు) ఓ వైపు నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరో వైపు డేవిడ్ మలన్(6), రూట్(0) ఔటైయ్యారు. వీరిద్దరి వికెట్లను హేజిల్‌వుడ్ పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
29 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోగా.. 60 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సీనియర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్(39), ఓలీపోప్(35) లు ఇంగ్లాండ్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ దశలో ఆసీస్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో ఇంగ్లాండ్ 50.1 ఓవర్లలో కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వర్షం పడడంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగకుండానే తొలి రోజు ఆటను అంపైర్లు ముగించారు.
పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కమిన్స్
- డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ తన తొలి టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఆసీస్ క్రికెట్ చరిత్రలో రెండోసారి. ఇంతకముందు జార్జ్ గిఫిన్ 1894లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ డెబ్యూ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే ఐదు వికెట్లు తీశాడు. 127 ఏళ్ల తర్వాత పాట్ కమిన్స్ ఆ ఫీట్‌ను రిపీట్ చేయడం విశేషం.
- ఇక యాషెస్ సిరీస్ పరంగా చూసుకుంటే డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ ఐదు వికెట్ల ఘనత అందుకోవడం 1982 తర్వాత మళ్లీ ఇప్పుడే. 1982 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ డెబ్యూ కెప్టెన్‌గా బాబ్ విల్లీస్ ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు ఘనత సాధించాడు.