'నెట్ రన్‌రేట్ గురించి కాదు.. ముందు దానిపై ఫోకస్‌ పెట్టండి'.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

By -  అంజి
Published on : 24 Feb 2026 12:49 PM IST

Ravichandran Ashwin YouTube, Team India Net Run Rate, India vs South Africa Super 8, Hardik Pandya, Rinku Singh, Jasprit Bumrah Bowling, Washington Sundar Strategy, T20 World Cup 2026

'నెట్ రన్‌రేట్ గురించి కాదు.. ముందు దానిపై ఫోకస్‌ పెట్టండి'.. టీమ్ ఇండియాకు అశ్విన్ సూచన

టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో గ్రూప్-1లో భారత్ నెట్ రన్‌రేట్ -3.800 కి పడిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ ఇండియా అనుసరించాల్సిన వ్యూహాలపై టీమిండియా మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. నెట్ రన్‌రేట్ గురించి ఇప్పుడే అతిగా ఆలోచించి జట్టు ఒత్తిడి పెంచుకోవద్దని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

"మనం రన్‌రేట్ గురించి చింతించడం ఆపి, మిగిలిన రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడంపైనే పూర్తి దృష్టి సారించాలి. జట్టులో హార్దిక్ పాండ్య, రింకు సింగ్ వంటి ప్రతిభావంతులు ఉన్నారు. వీరు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాలి. యువకులతో కూడిన మన జట్టు ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగాలి" అని పేర్కొన్నాడు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ఆ జట్టుపై భారత్ సులభంగా గెలవగలదని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఐసీసీ రూపొందిస్తున్న పిచ్‌లు బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరిస్తున్నాయని, మన బ్యాటింగ్ యూనిట్ ఈ పరిస్థితులను అర్థం చేసుకుని జాగ్రత్తగా షాట్లు ఆడాలని సూచించాడు.

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ వినియోగం విషయంలో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ కొన్ని తప్పులు చేసిందని అశ్విన్ అన్నాడు. "డికాక్, రికెల్టన్ వంటి లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నప్పుడు సుందర్‌ను ఉపయోగించుకుంటే ఫలితం బాగుండేది. డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నప్పుడు సుందర్ ఒక ఓవర్‌లో 11 పరుగులిచ్చాడు. జట్టులో రెగ్యులర్‌గా లేనప్పుడు ఇలా జరగడం సహజం, కానీ ఆ తర్వాత అతడికి మళ్ళీ బౌలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకపోవడం సరికాదు" అని విశ్లేషించాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను అశ్విన్ ఆకాశానికెత్తాడు. "నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం సామాన్యమైన విషయం కాదు. బుమ్రా వంటి గొప్ప బౌలర్ మన జట్టులో ఉండటం మన అదృష్టం. ఇలాంటి దిగ్గజాల గొప్పతనాన్ని వారు ఆడుతున్నప్పుడే గుర్తించాలి, రిటైర్ అయ్యాక కాదు" అని కొనియాడాడు.

Next Story