శిఖర్ ధావన్‌కు భార్య నుంచి విడాకులు మంజూరు చేసిన కోర్టు
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 10:44 AM ISTశిఖర్ ధావన్‌కు భార్య నుంచి విడాకులు మంజూరు చేసిన కోర్టు
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. శిఖర్ ధావన్ దంపతులు విడిపోతున్నట్లు గత రెండేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో ప్రాథమికంగా భార్య క్రూర ప్రవర్తన కారణంగానే వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది.
అయితే.. తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ శిఖర్ ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. తాజాగా ధావన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీపై ధావన్ చేసిన ఆరోపణలను ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు సమర్ధించింది. ధావన్ చేసిన ఆరోపణలను భార్య ఆయేషా నిజం కాదని రుజువు చేయలేకపోయిందని... విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్‌ను ఆయన భార్య మానసికంగా వేధించినట్లు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు గుర్తించింది. ఆయేషా తొలుత శిఖర్ ధావన్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు అంగీకరించింది. కానీ.. తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. దాంతో ధావన్ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో ధావన్ తన సొంతడబ్బులతో మూడు అంతస్తుల భవనం కొనుగోలు చేశాడు. ఆ భవనంపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలని ధావన్‌పై ఆయేశా ఒత్తిడి చేసినట్లు కోర్టు గుర్తించింది. ఈ ఆరోపణలను ఆయేషా వ్యతిరేకించలేదు.. దాంతో కోర్టు వాస్తవమేనని గుర్తించింది. అంతేకాదు ధావన్ పరువుకి భంగం కలిగేలా ఆయేషా వ్యవహరించిందని.. తోటి క్రికెటర్లు, బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి వతప్పుడు సందేశాలు పంపినట్లు కోర్టు విచారణలో తేలింది. డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా గుర్తించింది కోర్టు. ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ నిజమని తేలడంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.
కాగా.. ధావన్ తన కుమారుడితో వీడియో కాల్ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు.