ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 170 పరుగుల లక్ష్య చేధనలో ఓ దశలో 87/5 నిలిచినా.. కార్తీక్, షాబాద్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లారు. ఫలితంగా రాజస్థాన్ ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవి చూసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బట్లర్ ( 70 నాటౌట్; 47 బంతుల్లో 6 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో ఆకట్టుకోగా విండీస్ విధ్వంసకర వీరుడు హెట్‌మైర్ (42 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (37; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్ (29), అనూజ్ (26) ఫర్వాలేదనిపించగా.. కోహ్లీ (5), విల్లే (0), రూథర్‌ఫార్డ్ (5) లు విఫలం కావడంతో ఓ దశలో బెంగళూరు 87/5 తో నిలిచింది.
ఈ దశలో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ (44 నాటౌట్; 23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్), షాబాజ్ అహ్మద్ (45; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అనూహ్య రీతిలో చెలరేగడంతో బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ చెరో రెండు వికెట్లు తీశారు. కార్తీక్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.