MS Dhoni : తొలి మ్యాచ్‌లో ధోని ఆడుతాడా..? లేదా..?

ప్రాక్టీస్ సంద‌ర్భంగా ధోని మోకాలికి గాయ‌మైంది. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగే మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడో లేదోన‌న్న ఆందోళ‌న మొద‌లైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2023 8:30 AM GMT
MS Dhoni, IPL 2023

ఎంఎస్ ధోని

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స‌మ‌యం వ‌చ్చేసింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 16వ సీజ‌న్ నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. అతి పెద్ద స్టేడియం అయిన న‌రేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఆరంభ సీజ‌న్‌లోనే క‌ప్పును ముద్దాడిన హార్థిక్ నేతృత్వంలోని గుజరాత్ జ‌ట్టు మ‌రోసారి అదే ప్ర‌ద‌ర్శ‌న‌ను పున‌రావృతం చేయాల‌ని బావిస్తుండ‌గా ఐదో టైటిట్‌పై చెన్నై క‌న్నేసింది.

ఇదిలాఉంటే.. తొలి మ్యాచ్‌కు ముందు చెన్నై జ‌ట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడ‌డంపై అనుమానాలు నెల‌కొన్నాయి. ప్రాక్టీస్ సంద‌ర్భంగా ధోని మోకాలికి గాయ‌మైన‌ట్లు స‌మాచారం. అయితే.. గాయం తీవ్ర‌మైన‌ది కాద‌ని తెలుస్తోంది. అన‌వ‌స‌రంగా రిస్క్ ఎందుకు అని ధోని బావించి తొలి మ్యాచ్‌కు దూరం అయితే మాత్రం ఎవ‌రు జ‌ట్టును న‌డిపిస్తారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్‌, ర‌వీంద్ర జ‌డేజా, రుతురాత్ గైక్వాడ్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం ఉందనే చ‌ర్చ క్రీడావ‌ర్గాల్లో మొద‌లైంది.

అయితే.. చెన్నై ప్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం తొలి మ్యాచ్‌లో ధోని ఆడుతాడు అనే భ‌రోసా ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు ధోనీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతను 100 శాతం మొద‌టి మ్యాచ్ ఆడుతాడు. అని విశ్వానాథ‌న్‌ ఓ మీడియా సంస్థ‌కు తెలిపారు. ఈ విష‌యం తెలిసిన ధోని అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

గాయం కార‌ణంగా గ‌తేడాది దూరం అయిన దీప‌క్ చాహ‌ర్ ఈ సీజ‌న్‌కు రావ‌డంతో చెన్నై బౌలింగ్ విభాగం ప‌టిష్టంగా మారింది. ఓపెన‌ర్లుగా రుతురాత్ గైక్వాడ్‌, డేవాన్ కాన్వే లు బ‌రిలోకి దిగ‌నున్నారు. అంబ‌టి రాయుడు, శివ‌మ్ దూబే, ర‌వీంద్ర జ‌డేజా, మోయిన్ అలీ, బెన్‌స్టోక్స్‌ల‌తో మిడిల్ ఆర్డ‌ర్ చాలా ప‌టిష్టంగా క‌నిపిస్తోంది. మిస్ట‌రీ స్పిన్న‌ర్ మ‌హీశ్ తీక్ష‌ణ త‌న ఫామ్‌ను కొన‌సాగించాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.

తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాల‌ని ధోని సేన గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది.

Next Story