ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని బావిస్తుండగా.. వరుసగా రెండో మ్యాచ్‌లో గెలిచి.. విజయ పరంపర కొనసాగించాలని పంజాబ్ బావిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై నిషేదపు కత్తి వేలాడుతోంది. కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేదం ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.
ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ధోనీపై నిషేధం విధించే అవకాశం ఉంది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ధోనీపై ఇప్పటికే 12 లక్షల రూపాయల జరిమానా పడింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఏ జట్టైనా.. 90 నిమిషాల్లో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. తొలి సారి ఇలా చేస్తే రూ.12లక్షల జరిమానా విధిస్తారు. ఆ తరువాత రెండు మ్యాచ్‌లలోపు మరోసారి అదే తప్పిదం చేస్తే.. రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేదం విధిస్తారు. ఇప్పటికే ధోని పై ఓసారి ఫైన్ పడింది. ఒక వేళ నేటి మ్యాచ్‌లో చెన్నై జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకుంటే.. ధోని పై రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేదం పడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంతో పాటు నిర్ణీత సమయంలో తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.