టీమిండియా ఘోర ఓటమి.. టోర్నమెంట్‌లో ముందుకు సాగుతారా.?
దుబాయ్‌లో శుక్రవారం జరిగిన మహిళల T20 ప్రపంచకప్ గేమ్‌లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది
By M.S.R Published on 5 Oct 2024 3:11 AM GMTదుబాయ్‌లో శుక్రవారం జరిగిన మహిళల T20 ప్రపంచకప్ గేమ్‌లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్ పై గెలుపొందింది. ప్రత్యర్థి కెప్టెన్ సోఫీ డివైన్ అద్భుతమైన బ్యాటింగ్, వ్యూహాత్మక కెప్టెన్సీతో భారత జట్టుకు కోలుకోలేని షాక్ ను ఇచ్చింది. బ్యాటింగ్‌కు చాలా కష్టతరమైన పిచ్‌పై, డివైన్ 36 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆపై భారత జట్టు 19 ఓవర్లలో 102 పరుగులకే పరిమితమై ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. సుజీ బేట్స్ (27), ప్లిమెర్ ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 67 రన్స్ పార్ట్‌నర్‌షిప్ వచ్చింది. కివీస్ కెప్టెన్ డివైన్ 32 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు మంచి స్కోరును అందించింది.
ఇక లక్ష్య ఛేదనలో భారత జట్టుకు వరుస షాక్ లు తగిలాయి. రెండో ఓవర్‌లోనే షెఫాలీ (2) ఔట్‌కావడంతో మొదలైన వికెట్ల పతనం అలాగే సాగింది. స్మృతి మంధాన (12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (15) విఫలమయ్యారు. మిడిలార్డర్‌లో జెమీమా రొడ్రిగ్స్ (13), రిచా ఘోష్ (12), దీప్తి శర్మ (13) భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోయారు. అరుంధతి రెడ్డి (1) కూడా ఔట్‌కావడంతో ఇండియా 88/7తో ఓటమి ముంగిట నిలిచింది. చివర్లో పూజా వస్త్రాకర్ (8), శ్రేయాంక పాటిల్ (7), ఆశా శోభన (6 నాటౌట్), రేణుకా సింగ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో భారత్ ఘోర ఓటమిని మూట గట్టుకుంది. ఆదివారం నాడు టీమిండియా పాకిస్థాన్ తో తలపడనుంది.