ఇంకో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ ప్రారంభం కానుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. దీంతో బెంగళూరు శిబిరంలో కలవరపాటు మొదలైంది. ఈ సీజన్‌లో అతడిపై బెంగళూరు చాలా ఆశలే పెట్టుకుంది. గతేడాదే ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన ఈ ఆటగాడు అదరగొట్టాడు. 15 మ్యాచుల్లో 31.53 సగటుతో 473 పరుగులు సాధించాడు. ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 737 పరుగులతో టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా.. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఇంతకుముందు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ నితీష్ రాణా.. దాని నుంచి కోలుకొని మళ్లీ టీమ్‌తో చేరాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్‌ను కరోనా వదల్లేదు. కంటెంట్ టీమ్‌లోని సభ్యుడు ఒకరు కరోనా బారిన పడ్డాడు. మరోవైపు ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాల్సిన వాంఖడె స్టేడియంలో పని చేస్తున్న సిబ్బందిలో ఏకంగా పది మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మ్యాచ్‌ల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించుకున్న ఈవెంట్ మేనేజర్లలోనూ ఆరేడుగురు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇలా మొత్తంగా లీగులో భాగమైన 20 మందికి పైగా కరోనా సోకింది. దీంతో ఈ సారి ఐపీఎల్‌కు కరోనా గండం తప్పేలా లేదంటున్నారు కొందరు. ఇదిలా ఉంటే.. శుక్రవారం తన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.