రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కేసుపై మీడియా అత్యుత్సాహం.. కేసు పెట్టిన న్యాయవిద్యార్థి.. రేపే విచారణ

Delhi court likely to hear plea to stop media trial of Sushil Kumar. సుశీల్‌ కుమార్‌ పై కేసు విషయంలో మీడియా సమాంతరంగా విచారణ కొనసాగిస్తోందని, అది వెంటనే ఆపేయాలని కోరుతూ ఓ న్యాయశాస్త్ర విద్యార్థి దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on  27 May 2021 3:37 PM GMT
Sushil Kumar

తోటి రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అరెస్టైన సుశీల్‌ కుమార్‌ కథ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. బయటినుంచి పోలీసులు కొత్త కొత్త ఆధారాలు సంపాదిస్తున్నారు కానీ సుశీల్ మాత్రం నోరు విప్పి పెద్దగా వివరాలు చెప్పటం లేదు. దీంతో అతడిని విచారించేందుకు మానసిక వైద్యనిపుణుల సాయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు రాణాపై దాడి సంఘటనలో ప్రత్యక్ష సాక్షులను పోలీసులు విచారించారు. ఎనిమిది మంది నుంచి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసుకున్నారు. పేరు మోసిన గ్యాంగ్ స్టర్ కళా జతేదీ సోదరుడు ప్రదీప్ తో అటు సుశీల్ కు ఇటు మరణించిన సాగర్ రాణాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఓ కేసులో ప్రదీప్ కి సాయపడేందుకు సుశీల్ సోనీపట్ వెళ్లాడని ఖాకీలు తెలిపారు. తనకు ఏ గ్యాంగ్ స్టర్ తోనూ సంబంధాలు లేవని సుశీల్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పాడనీ కానీ ఇది అబద్దమంటూ ఓ ఫోటో విడుదల చేశారు.

2018 డిసెంబరు 18 న కళా జతేదీ సోదరుడు ప్రదీప్ తో సుశీల్ దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పోలీసులు షేర్ చేశారు. ప్రదీప్ తలపై 7 లక్షల రూపాయల రివార్డు ఉండగా.. అతను పోలీసుల నుండి తప్పించుకొని విదేశాలకు పరారయ్యాడు. అటు సుశీల్ చేతిలో హతుడైన సాగర్ రానాకు కూడా పరోక్షంగా విద్రోహ శక్తులతో సంబంధాలున్నట్టు సమాచారం. రానా స్నేహితుడైన సోను.. క‌ళా జతేదీకి కుడి భుజమని, అతడు సాగించిన నేరాల్లో ఇతనికి కూడా ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు.

అయితే తన క్లయింటును అన్యాయంగా కేసులో ఇరికించారని సుశీల్ తరఫు లాయర్ అంటున్నారు. కొందరు కావాలనే కేసును తప్పుదారి పట్టించి తన క్లయింటును చిక్కుల్లో పడేశారని, సాగర్ రానా మర్డర్ లో ఆయన హస్తం లేదని ఆ లాయర్ వాదిస్తున్నారు. ఇదే సమయంలో సుశీల్‌ కుమార్‌ పై కేసు విషయంలో మీడియా సమాంతరంగా విచారణ కొనసాగిస్తోందని, అది వెంటనే ఆపేయాలని కోరుతూ ఓ న్యాయశాస్త్ర విద్యార్థి దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కు సుశీల్‌ కుటుంబ అనుమతి లేదని, ప్రచారం కోసమే అతడాపని చేశారని తెలుస్తోంది. ఈ పిటిషన్ ను కోర్ట్ రేపు విచారించునుంది.


Next Story