దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2021 మలి దశలో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) డకౌట్ అవడంతో జట్టు ఆదిలోనే కష్టాల పాలయ్యింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు వృద్ధిమాన్ సాహా (18), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18), మనీశ్ పాండే (17), జేసన్ హోల్డర్ (10), అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్(22) పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ 134/9 స్కోరుతో నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో రబాడ మూడు, అక్షర్ రెండు, నోకియా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇన్నింగ్సు మూడో ఓవర్లో పృథ్వీ షా (11) ఔటయ్యాడు. శిఖర్ ధావన్ (42), శ్రేయస్ అయ్యర్(47) రాణించడంతో లక్ష్యం సులువైంది. రషీద్ ఖాన్ వేసిన 10.5 బంతికి శిఖర్ ధావన్ అవుట్ అవడంతో కెప్టెన్ రిషభ్ పంత్(35) క్రీజులో వచ్చాడు. ఇరువురు ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. నోకియాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొమ్మిది మ్యాచ్ లాడిన ఢిల్లీ ఏడు విజయాలతో మొదటి స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్‌లాడి ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉంది.