కీల‌క పోరులో ఢిల్లీ విజ‌యం.. ప్లే ఆప్స్ ఆశ‌లు స‌జీవం

Delhi Capitals beat Punjab Kings by 17 runs.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 May 2022 3:34 AM GMT
కీల‌క పోరులో ఢిల్లీ విజ‌యం.. ప్లే ఆప్స్ ఆశ‌లు స‌జీవం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్ర‌యాణం ప‌డుతూ లేస్తూ అన్న‌ట్లుగా సాగుతోంది. అయితే.. ప్లే ఆప్స్‌కు చేరాలంటే త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు అద‌ర‌గొట్టింది. పంజాబ్ కింగ్స్ పై 17 ప‌రుగుల తేడాలో గెలుపొందింది. 13 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఢిల్లీ.. మెరుగైన ర‌న్‌రేట్ ఉండ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఆరు మ్యాచుల్లో మాత్ర‌మే నెగ్గిన పంజాబ్ టోర్నీలో ఇక ముంద‌డుగు వేయ‌డం చాలా క‌ష్టం. ఢిల్లీ త‌న చివ‌రి మ్యాచ్‌లో ముంబైతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో క‌నుక ఢిల్లీ విజ‌యం సాధిస్తే దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన‌ట్లే.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్‌ (63; 48 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ‌శ‌త‌క‌తంతో రాణించ‌గా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (32; 16 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ తొలి బంతికే డ‌కౌట్ కాగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (7), రావ్‌మన్‌ పావెల్‌ (2) లు విఫ‌లం అయ్యారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో లియాన్ లివింగ్ స్టోన్‌, అర్ష్ దీప్‌లు చెరో మూడు వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బ‌కొట్టారు.

అనంత‌రం చేధ‌న‌లో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో (28; 15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), జితేశ్‌ శర్మ (44; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ల పోరాటం స‌రాపోలేదు. శిఖర్‌ ధవన్‌ (19), భానుక రాజపక్స (4), లివింగ్‌స్టోన్‌ (3), మయాంక్‌ అగర్వాల్‌ (0), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (1), రిషి ధవన్‌ (4) లు విఫ‌లం కావ‌డంతో పంజాబ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. శార్దూల్‌ ఠాకూర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Next Story