మొతేరాలో పృథ్వీ షా పరుగుల మోత
Delhi Capitals Beat Kolkata Knights Riders. ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది.
By Medi Samrat
ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) చెలరేగడంతో ఢిల్లీ అలవోకగా విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆరంభంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) నిలకడగా ఆడగా.. మిడిలార్డర్ మాత్రం దారుణంగా తడబడింది. చివర్లో రస్సెల్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 నాటౌట్) మెరుపులతో జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్, లలిత్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పృథ్వీ షా(41 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లతో 82) ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే పేసర్ శివమ్ మావికి చుక్కలు చూపించాడు. తొలి ఓవర్ ఆరు బంతులను 4,4,4,4,4,4 బౌండరీలకు తరలించి తన దూకుడును ప్రదర్శించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) కూడా రాణించడంతో ఢిల్లీ 16.3వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 14వ ఓవర్ నుండి కేకేఆర్ బౌలర్ కమిన్స్ మూడు వికెట్లు తీసి దూకుడు పెంచినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.