ఫ‌టాఫ‌ట్ పృథ్వీ.. ధ‌నాధ‌న్ ధ‌వ‌న్‌..!

Delhi Capitals Beat Chennai Super Kings. ఐపీఎల్‌-14లో భాగంగా శ‌నివారం జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు చెన్నైపై సునాయ‌స విజ‌యం సాధించింది. ‌

By Medi Samrat
Published on : 11 April 2021 7:48 AM IST

IPL 2021

ఐపీఎల్‌-14లో భాగంగా శ‌నివారం జ‌రిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ జ‌ట్టు చెన్నైపై సునాయ‌స విజ‌యం సాధించింది. గురు శిష్యుల సమరంగా పేర్కొన్న చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లో.. ధోనీపై‌ పంత్‌దే పైచేయి అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. రైనా (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), మొయిన్‌ అలీ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), సామ్‌ కర్రాన్‌ (15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 34) రాణించారు. వోక్స్‌, అవేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి

అనంత‌రం 189 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో క్రీజులోకి వ‌చ్చిన‌ ఢిల్లీ ఓపెన‌ర్లు.. సీఎస్‌కే‌ పేలవమైన బౌలింగ్‌ను చెండాడారు. శిఖర్‌ ధవన్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85), పృథ్వీ షా (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) ఢిల్లీ క్యాపిటల్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందించారు. గతేడాది చెత్త ప్రదర్శనతో నిరాశపరిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. తాజా సీజన్‌ను కూడా పేలవంగానే ఆరంభించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. పృథ్వీ షా, శిఖర్‌ ధవన్‌ వీర బాదుడుకు సీఎ్‌సకే బౌలర్లు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో పడిపోయారు. ఏ బంతిని ఎవరు వేసినా.. ఎలా వేసినా బౌండరీకే దారి.. అనే రీతిలో వీరు చెలరేగారు. దీంతో 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. శిఖ‌ర్‌ ధవన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.


Next Story