David Warner : ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్న‌ర్‌.. అక్ష‌ర్ ప‌టేల్‌కు ప్ర‌మోష‌న్‌

పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంతో అత‌డి స్థానంలో డేవిడ్ వార్న‌ర్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2023 2:30 PM IST
Delhi Capitals captain, David Warner,

డేవిడ్ వార్న‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2023 సీజ‌న్ మార్చి 31 నుంచి ఆరంభం కానుంది. క‌ళ్లు చెదిరే ఫీల్డింగ్‌, విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు, సంచ‌ల‌న బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు చూసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సీజ‌న్ ప్రారంభం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం లేక‌పోవ‌డంతో అన్ని జ‌ట్లు ప్రాక్టీస్‌ను మొద‌లెట్టాయి. ఈ సారి ఎలాగైన పంత్ సార‌థ్యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ క‌ప్ సాధిస్తుంద‌ని అభిమానులు బావిస్తుండ‌గా పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ఈ సీజ‌న్ మొత్తానికి దూరం అయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఈ సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టును ఎవ‌రు న‌డిపిస్తార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. మిచెల్ మార్ష్, లుంగి ఎంగిడి, డేవిడ్ వార్న‌ర్‌ వంటి విదేశీ ఆట‌గాళ్ల‌తో పాటు అక్ష‌ర్ ప‌టేల్, ఇషాంత్ శ‌ర్మ వంటి భార‌త ఆట‌గాళ్లు ఉండ‌డంతో ఎవ‌రికి కెప్టెన్సీ ఇస్తారు అన్న చ‌ర్చ మొద‌లైంది. ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. ఎట్ట‌కేల‌కు వాటి అన్నింటికి తెర‌దించుతూ త‌మ జ‌ట్టు కెప్టెన్ ఎవ‌రు అనే విష‌యాన్ని ఢిల్లీ జ‌ట్టు యాజ‌మాన్యం చెప్పేసింది.

ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఢిల్లీ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. ఐపీఎల్ టైటిల్‌ను గెల‌వాల‌న్న ఢిల్లీ ఆశ‌ల‌ను వార్న‌ర్ అయినా తీరుస్తాడో లేదా చూడాల్సిందే.

ఇక డేవిడ్ వార్న‌ర్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ కొత్త కాదు. 2015లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన వార్న‌ర్ 2016లో ఆ జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిలిపాడు. అత‌డి హ‌యాంలో ఐదు సార్లు హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అత‌డి నాయ‌క‌త్వంలోనే హైద‌రాబాద్ ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల 2021 ఐపీఎల్ సీజ‌న్ మ‌ధ్య‌లో త‌న సార‌థ్యాన్ని కోల్పోవ‌డంతో పాటు జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అత‌డి హైద‌రాబాద్ వ‌దిలివేయ‌గా.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ తీసుకుంది. గ‌త సీజ‌న్ నుంచి ఢిల్లీ త‌రుపున వార్న‌ర్ ఆడుతున్నాడు.

Next Story