దీపిక త‌డ‌బాటు.. సీడింగ్‌ రౌండ్‌లో 9వ స్థానం

Deepika Kumari finishes ninth in Tokyo Olympics Ranking Round.ఈసారి ఒలింపిక్స్‌లో మెడ‌ల్ ఖాయ‌మ‌నుకున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 6:45 AM GMT
దీపిక త‌డ‌బాటు.. సీడింగ్‌ రౌండ్‌లో 9వ స్థానం

ఈసారి ఒలింపిక్స్‌లో మెడ‌ల్ ఖాయ‌మ‌నుకున్న గేమ్స్‌లో ఆర్చ‌రీ ఒక‌టి. కానీ తొలి రోజే అర్హ‌త రౌండ్ల‌లో మ‌న ఆర్చ‌ర్లు నిరాశ‌ప‌రిచారు. ప్రపంచ నంబర్‌వన్‌, భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ విభాగం వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో నిరాశపరిచింది. శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్‌లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్‌ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. త‌రువాతి రౌండ్ల‌లో భూటాన్‌కు చెందిన క‌ర్మ‌తో దీపిక త‌ల‌ప‌నుంది.


దీపిక తొలి అర్థ‌భాగంలో 36, ద్వితీయార్థంలో 36 బాణాలు సంధించింది. ప‌ది మార్కుల‌కు 30 బాణాలు గురిపెట్ట‌టా.. మ‌ధ్య బిందువు(ఎక్స్‌)కు 13 బాణాలు ఎక్కుపెట్టింది. నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల మ‌ధ్య‌స్థ‌లంగా ఉంది. ఇలా ఎందుకు జ‌రిగిందో తెలియ‌దు. మెరుగ్గా ఆడేందుకు నా షాట్ల‌ను నియంత్రించా. నాతో నేను మాట్లాడుకున్నా. నా భావోద్వేగాల‌ను నియంత్రించుకొనేందుకు ప్ర‌య‌త్నించా. త‌రువాత రౌండ్ల‌లో మెరుగ్గా ఆడుతాన‌ని దీపిక తెలిపింది.


ఇక‌ పురుషుల సింగిల్స్‌లో అయితే మ‌న వాళ్ల ప్ర‌ద‌ర్శ‌న మ‌రింత దారుణంగా ఉంది. ర్యాంకింగ్ రౌండ్‌లో ప్ర‌వీణ్ జాద‌వ్ 656 పాయింట్ల‌తో 31వ స్థానంలో నిలిచాడు. ఇండియా త‌ర‌ఫున అత‌డిదే బెస్ట్ ర్యాంక్‌. ఇక అతాను దాస్ అయితే 653 పాయింట్ల‌తో 35వ స్థానానికి ప‌రిమిత‌మ‌య్యాడు. మ‌రో ఆర్చ‌ర్ త‌రుణ్‌దీప్ రాయ్ 37వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు.

Next Story