దీప‌క్ చాహ‌ర్ అద్భుత బ్యాటింగ్‌.. భార‌త్ ఘ‌న‌విజ‌యం

Deepak Chahar Leads India To 3 Wicket Win.తొలి వ‌న్డేలో క‌నీసం పోరాట ప‌టిమ కూడా చూప‌ని లంకేయులు రెండే వ‌న్డేలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 2:31 AM GMT
దీప‌క్ చాహ‌ర్ అద్భుత బ్యాటింగ్‌.. భార‌త్ ఘ‌న‌విజ‌యం

తొలి వ‌న్డేలో క‌నీసం పోరాట ప‌టిమ కూడా చూప‌ని లంకేయులు రెండే వ‌న్డేలో మాత్రం టీమ్ఇండియాకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. లంక బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో భార‌త టాప్ ఆర్డ‌ర్ పూర్తిగా విఫ‌ల‌మైంది. ల‌క్ష్యాన్ని చేదించే క్ర‌మంలో స‌గం ప‌రుగులైనా చేయ‌క‌ముందే సగం జ‌ట్టు పెవిలియ‌న్ చేరింది. ఈ ద‌శంలో భార‌త ఓట‌మి లాంచ‌న‌మే అనుకున్నారంతా.. అయితే.. పేస్ బౌల‌ర్ దీప‌క్ చాహ‌ర్ అద్భుతమే చేశాడు. ఒంతి చేత్తో భార‌త జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. దీంతో రెండో వ‌న్డేలో భార‌త్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంక పై గెలుపొందింది. మ‌రో మ్యాచ్ ఉండ‌గానే వ‌న్డే సిరీస్‌ను 2-0తో కైవ‌సం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు అవిష్కా ఫెర్నాండో(50), మినోద్ భానుక(36) మంచి శుభారంభాన్ని అందించారు. ఆరంభంలో కొంచెం ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత వరుస బౌండరీలతో విరుచుకుపడింది. తొలి వికెట్‌కు 77 ప‌రుగులు జోడించారు. చివర్లో చమిక కరుణరత్నే(33 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. మినోద్ భానుక(36), ధనుజంయ డిసిల్వా(36) కూడా పర్వాలేదనిపించారు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 రన్స్ చేసింది. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/50), భువనేశ్వర్ కుమార్(3/54) మూడేసి వికెట్లు తీయగా, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు.

చాహ‌ర్ సూప‌ర్ బ్యాటింగ్‌..

చేజింగ్‌కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(13), వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్(1) తీవ్రంగా నిరాశపరిచారు. పృథ్వీ షాను హసరంగా .. ఇషాన్ కిషన్‌ను రజితా క్లీన్ బౌల్డ్ చేశారు. దాంతో 39 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(37)తో కెప్టెన్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని డిసిల్వా విడదీశాడు.

జోరుమీదున్న ధావన్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో 65 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(53) రాగా.. మనీష్ పాండే(37) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. కానీ మనీష్ పాండే రనౌటవ్వడంతో 5వ వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కృనాల్‌(35)తో క‌లిసిసూర్య పోరాడాడు. సందకన వేసిన 27 ఓవర్ తొలి బంతిని బౌండరీ తరలించిన సూర్య.. కెరీర్‌లో ఫస్ట్ వన్డే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగాడు. అప్పటి వరకు దూకుడుగా ఆడిన అతను ఆ బంతిని డిఫెన్సివ్ చేయబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.

ఆ తర్వాత భువీ బదులు దీపక్ చాహర్‌(69 నాటౌట్ ; 82 బంతుల్లో 7పోర్లు, 1 సిక్స్‌) ను పంపించిన టీమ్‌మేనేజ్‌మెంట్ అద్భుత ఫలితాన్ని రాబట్టింది. ఓవైపు కృనాల్ ఔటైనా దీపక్ చాహర్ అద్భుతంగా పోరాడాడు. బ్యాట్స్‌మెన్ తరహాలో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. అత‌డికి తోడుగా భువ‌నేశ్వ‌ర్ కుమార్‌(19 నాటౌట్ ; 28 బంతుల్లో 2 పోర్లు) కూడా క్రీజులో నిలిచాడు. వీరిద్ద‌రు అభేద్య‌మైన ఎనిమిదో వికెట్‌కు 84 ప‌రుగులు జోడించడంతో 49.1 ఓవ‌ర్ల‌లో భార‌త్ 7 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేదించింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్‌ కచ్చితంగా నిలిచిపోతుంది. సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడిన దీప‌క్ చాహ‌ర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భించింది.

Next Story