రిషబ్ పంత్‌కు భారీ షాక్
DC Captain Pant Fined Rs 12 Lakh for Slow Over Rate Against LSG.అసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ
By తోట వంశీ కుమార్ Published on 8 April 2022 11:57 AM ISTఅసలే వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటు కారణంగా( నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయకపోవడంతో) పంత్‌కు రూ.12లక్షల ఫైన్ విధించినట్లు వెల్లడించారు. గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో పంత్‌కు పైన్ పడింది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం తొలిసారి ఓవర్ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, అదే తప్పు మరోసారి రిపీట్ చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత, మూడోసారి కూడా అదే పునరావృతమైతే.. కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడికి రూ. 12 లక్షల జరిమానా, లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (61; 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో చెలరేగగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (39 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్; 28 బంతుల్లో 3పోర్లు) ఆఖరి వరకు క్రీజులో నిలిచినా వేగంగా ఆడడంతో విఫలం కావడంతో ఢిల్లీ జట్టు ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది.
అనంతరం లక్నో 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (80; 52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివరి ఓవర్‌లో యువ ఆటగాడు ఆయుశ్ బదోనీ (10 నాటౌట్; 3 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) ఎలాంటి పొరబాటుకు తావు ఇవ్వకుండా తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (24), కృనాల్ పాండ్య(19 నాటౌట్) రాణించారు.
ఇక మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. తేమ ఇలా ఉంటే ఎవ్వరినీ తప్పుబట్టలేమన్నాడు. అక్కడ చేసేదేం లేదు. ఒక బ్యాటింగ్ యూనిట్‌గా మేం ఈ మ్యాచ్‌లో 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేశాం. ఆఖర్లో లఖ్‌నవూ బౌలర్లు అవేశ్‌ఖాన్, జేసన్ హోల్డర్‌లు అద్భుతంగా బౌలింగ్ చేయడం పరుగులు చేయడం కష్టమైంది. ఇక మా బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినా వికెట్లు దక్కలేదన్నాడు. ఫలితం లభించలేదన్నాడు.