మరో దుమారానికి తెర తీయబోయిన వార్నర్.. మళ్లీ
David Warner tries a Cristiano Ronaldo.ఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి వచ్చాడు.
By తోట వంశీ కుమార్ Published on 29 Oct 2021 7:26 AM GMTఎట్టకేలకు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి వచ్చాడు. టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గురువారం రాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసీస్ ఓపెనర్ 42 బంతుల్లో 10 పోర్లు సాయంతో 65 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఫామ్‌లోకి రావడంతో మ్యాచ్ ముగిసిన అనంతరం డేవిడ్ వార్నర్ మంచి జోష్‌లో కనిపించాడు. మీడియాతో మాట్లాడుతూ.. విమర్శకుల నోర్లను మూయించడం సాధ్యంకాదన్నాడు. ఆటలో ఇవన్ని సహజమన్నాడు. వీటిని పట్టించుకోకుండా ముఖంపై చిరునవ్వు చెదరనీయకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని వార్నర్ చెప్పాడు.
.@davidwarner31 trying to be @Cristiano
— Thakur (@hassam_sajjad) October 28, 2021
"if it's good enough for Cristiano, it's good enough for me" pic.twitter.com/Nyc7NfyKEs
ఇదిలా ఉంటే.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా వార్నర్ ప్రవర్తించిన చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూరో ఛాంపియన్‌షిప్ మీడియా సమావేశం సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను పక్కకుపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే తరహాలో వార్నర్ సైతం వ్యవహరించాడు. 'వీటిని పక్కకు పెట్టవచ్చా' అంటూ తన ముందున్న కోకా కోలా బాటిళ్లను తీసి కిందపెట్టాడు. ఓ వ్యక్తి అక్కడే పెట్టాలని సూచించగా.. ఓహూ అక్కడే పెట్టాలా సరేనంటూ.. వాటికి యధాస్థానంలో పెట్టాడు. ఇఫ్ ఇటీజ్ గుడ్ ఎనఫ్ ఫర్ క్రిస్టియానో, ఇటీజ్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ అంటూ నవ్వుతూ కామెంట్ చేశాడు. రొనాల్డో చేసిన ఆ పని కారణంగా.. కోకాకోలాకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. మళ్లీ వార్నర్ అదే పని చేసేందుకు యత్నించాడు. కాగా.. చాలా కాలంగా క్రికెట్‌కు కోకాకోలా స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. వెంటనే ఐసీసీ కూడా దీనిపై స్పందించింది. వార్నర్ సరదాగానే ఆ పని చేశాడని చెప్పుకొచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), చరిత్ అసలంక (27 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం 155 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 17 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వార్నర్ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) దంచికొట్టారు.