మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

David Warner ruled out of last two Tests through injury.వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆస్ట్రేలియాకు గ‌ట్టి షాక్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2023 7:50 AM GMT
మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆస్ట్రేలియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇప్ప‌టికే రెండు టెస్టులు పూర్తి కాగా.. మిగిలిన రెండు టెస్టుల‌కు ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ దూరం అయ్యాడు. ఇప్ప‌టికే స్టార్ పేస‌ర్ జోష్ హాజిల్‌వుడ్ చీల‌మండ‌ల గాయం కార‌ణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా ఇప్పుడు వార్న‌ర్ కూడా అత‌డి బాట‌నే అనుస‌రించ‌డం ఆసీస్‌కు ఖ‌చ్చితంగా ఎదురుదెబ్బ‌గానే చెప్పవ‌చ్చు.

ఢిల్లీలో జ‌రిగిన రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ విసిరిన బంతి వార్న‌ర్ హెల్మెట్‌ను బ‌లంగా తాకింది. మ‌రికొన్ని బంతులు అత‌డి చేతిని తాకాయి. దీంతో కాంక‌ష‌న్ వ‌ల్ల వార్న‌ర్ మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో రెన్ షాను ఆడించారు. అయితే.. వార్న‌ర్ ఇంకా ఫిట్‌నెస్ సాధించ‌లేదు. అంతేకాకుండా అత‌డి ఎడ‌మ మోచేయి వ‌ద్ద స్వ‌ల్పంగా ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ తెలిపింది.

దీంతో మూడు, నాలుగో టెస్టుల‌కు అత‌డు అందుబాటులో ఉండ‌డం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఓ ప్ర‌క‌ట‌న‌లో మంగ‌ళ‌వారం తెలిపింది. వార్న‌ర్ సిడ్నీకి బ‌య‌లుదేరుతాడ‌ని తెలిపింది. భార‌త్‌తో వ‌న్డే సిరీస్ (మార్చి 17) నాటికి తిరిగి జ‌ట్టుతో వార్న‌ర్ చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది.

ఇక ఈ సిరీస్‌లో వార్న‌ర్ దారుణంగా విఫ‌లం అయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో1,10,15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

Next Story