విలియమ్సన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసిన వార్నర్
David warner key comments on kane williamson.విలియమ్సన్ జట్టులో చేరడంపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 12:46 PM ISTఐపీఎల్ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూసింది. ముఖ్యంగా మిడిలార్డర్ ఘోరమైన వైఫల్యం కారణంగా గెలిచే మ్యాచ్ లను కూడా సన్ రైజర్స్ కోల్పోయింది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది.
షారుఖ్ ఖాన్ (17 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), మయాంక్ అగర్వాల్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. ఖలీల్ అహ్మద్ (3/21), అభిషేక్ శర్మ (2/24) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి 121 పరుగులు చేసి సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బెయిర్‌స్టో (56 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... వార్నర్ (37 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.
విలియమ్సన్ జట్టులో చేరడంపై సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ఈ విజయంలో మా బౌలర్లదే కీలక పాత్ర అని చెప్పుకొచ్చాడు. అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మా చేతుల్లోకి తీసుకొచ్చారని.. ఈ విజయంతో మాపై ఒత్తిడి తగ్గిందని అన్నాడు. విలియమ్సన్ తుది జట్టులో ఉండడంతో మా బలం పెరిగిందని.. అతని రాక వల్ల టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ విజయం మాకు కొత్త ఊపిరినిచ్చింది. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇలాగే మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తామని వార్నర్ తెలిపాడు. సన్ రైజర్స్ మిడిలార్డర్ ఘోరంగా విఫలమవుతూ ఉండగా.. విలియమ్సన్ తుది జట్టులోకి రావాలని ప్రతి ఒక్క సన్ రైజర్స్ అభిమాని ఎదురు చూశాడు. సన్ రైజర్స్ వరుసగా మూడు ఓటములను చవి చూశాక.. విలియమ్సన్ ఫిట్ నెస్ సాధించడం.. మ్యాచ్ గెలవడం జరిగింది.