ఐపీఎల్ 2021లో పాల్గొనడం కోసం విదేశీ ఆటగాళ్లు ఒక్కరొక్కరుగా భారత్ చేరుకుంటున్నారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌లు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. వీరితోపాటు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్ కూడా ఉన్నాడు. వీరి రాకకు సంబంధించి సన్‌రైజర్స్ యాజమాన్యం తమ ట్విటర్ అకౌంట్‌లో ఓ పోస్టు చేసింది.
ఈ మేరకు.. ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి.. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బ్రాడ్ హడిన్‌లకు స్వాగతం అంటూ సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. ఎస్ఆర్‌హెచ్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో సన్‌రైజర్స్ యాజమాన్యం.. ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న 14వ ఐపీఎల్ సీజన్‌లో ఈ నెల 11న తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ జట్టు తొలి ఐదు మ్యాచ్‌లను చెన్నైలోనే ఆడనుంది. ఆ తర్వాత ఢిల్లీలో నాలుగు మ్యాచ్‌లు, కోల్‌కతాలో మూడు, బెంగళూరులో రెండు మ్యాచ్‌లు ఆడనుంది.