వందలో వంద కొట్టిన వార్నర్.. అరుదైన జాబితాలో చోటు
David Warner joins an elite club with a century in his 100th Test.డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి వచ్చాడు.
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2022 11:11 AM ISTఎట్టకేలకు విధ్వంసకర వీరుడు, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి వచ్చాడు. గత మూడేళ్లుగా సెంచరీ చేయలేక ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న వార్నర్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శతకాన్ని సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో వార్నర్‌కు ఇది 25వ శతకం కాగా.. తన కెరీర్‌లో ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా వందో టెస్టులో సెంచరీ చేసిన పదో బ్యాటర్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియా తరుపున ఈ ఘనత సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ కంటే ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో వార్నర్ మరో ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
100 వ టెస్టులో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితా ఇదే.
ఇంగ్లాండ్ ఆటగాడు కొలీన్ కౌడ్రే(104), పాకిస్థాన్‌కు ఆటగాడు జావెద్ మియాందాద్(145), వెస్టిండీస్ ఆటగాడు గ్రీనిడ్జ్(149), ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్ స్టివార్ట్(105), పాకిస్థాన్ ఆటగాడు ఇంజమాముల్ హక్(184), ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్(120, 143 నాటౌట్), దక్షిణాఫ్రికా ఆటగాడు గ్రేమ్ స్మిత్(131), దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా(134), ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్(218) , ఘనత సాధించారు.
వందో టెస్టులో సెంచరీ చేసిన జాబితాలో ఒక్క భారత క్రికెటర్ లేకపోవడం కాస్త నిరాశపరిచే అంశం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ రెండో రోజు ట్రీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 193 పరగులు, ట్రావిస్ హెడ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నాడు. వార్నర్ ఊపు చూస్తుంటే తన వందో టెస్టులో ద్విశతకం చేసేలా కనిపిస్తున్నాడు.