మాల్దీవుల్లో ఆసీస్ క్రికెటర్లు కొట్టుకున్నారా.. డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే..!

David Warner and Michael Slater brawl in Maldives bar.ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లు, కామెంట్రేటర్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 May 2021 9:21 PM IST
మాల్దీవుల్లో ఆసీస్ క్రికెటర్లు కొట్టుకున్నారా.. డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే..!

ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లు, కామెంట్రేటర్లు సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆసీస్ క్రికెటర్లు మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయారు. వారు ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నారు. వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు, కామెంట్రేటర్లు మాల్దీవుల్లో 14 రోజుల పాటూ క్వారెంటైన్ లో ఉన్నారు. ఈ క్వారెంటైన్ పూర్తీ అయిన తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలపై చర్చించనున్నారు. అయితే మాల్దీవుల్లో ఓ ఊహించని ఘటన జరిగిందనే కథనాలు వచ్చాయి.

అదేమిటంటే డేవిడ్ వార్న‌ర్‌, ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ స్లేట‌ర్‌ మాల్దీవ్స్‌లోని ఓ బార్‌లో కొట్టుకున్నార‌ని. ఐపీఎల్ ఊహించని విధంగా ముగియ‌డంతో ఆసీస్ క్రికెట‌ర్లు, ఇత‌ర సిబ్బంది, కామెంటేట‌ర్లు మాల్దీవ్స్‌కు వెళ్లారు. అక్క‌డి బార్‌లో ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్న‌ట్లుగా ద డైలీ టెలిగ్రాఫ్ ఓ స్టోరీ రాసింది. మంచి ఫ్రెండ్స్ అయినా, ఓ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లింద‌ని ఆ ప‌త్రిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు ఉన్న తాజ్ కోర‌ల్ రిసార్ట్‌లోనే ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు కథనాలను రాశారు.

ఈ వార్తను స్లేటర్, వార్నర్ ఇద్దరూ ఖండించారు. స్లేట‌ర్ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఫిల్ రోత్‌ఫీల్డ్‌కు మెసేజ్‌ చేశాడట. నేను, వార్న‌ర్‌ ఎప్పటి నుంచో మంచి స్నేహితులం.. తమ మ‌ధ్య గొడ‌వ జ‌రిగే అవ‌కాశ‌మే లేదని.. ఇదంతా రూమర్ మాత్రమేనని చెప్పాడట. వార్న‌ర్ కూడా ఈ వార్తను తీవ్రంగా ఖండించాడు. మీకు ఇలాంటి పుకార్లు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో నాకు తెలియ‌డం లేదు.. ఇటువంటి వార్తలు రాసే ముందు బ‌ల‌మైన ఆధారాలు ఉంటేనే రాయాలని ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఏమీ జరగకున్నా కూడా ఇలాంటి వార్త వైరల్ అవ్వడంపై ఇద్దరూ కాస్త గుర్రుగానే ఉన్నారు.


Next Story