ఐపీఎల్‌ను వెంటాడుతున్న‌ క‌రోనా.. మ‌రో స్టార్ ఆట‌గాడికి పాజిటివ్

Daniel sams tested covid-19 positve. ‌ఐపీఎల్ 2021 సీజ‌న్‌కు క‌రోనా క‌ష్టాలు, ఆల్‌రౌండ‌ర్ డేనియెల్ సామ్స్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 6:26 AM GMT
Daniel sams

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్‌కు క‌రోనా క‌ష్టాలు ఇప్ప‌ట్లో తొలిగేలా క‌నిపించ‌డం లేదు. ఇంకా ఈ లీగ్ ప్రారంభం కాక‌ముందే క‌రోనా వైర‌స్ ఆట‌గాళ్ల‌ను వెంటాడుతోంది. తాజాగా మ‌రో స్టార్ ఆట‌గాడు క‌రోనా బారిన ప‌డ్డాడు. ఆల్‌రౌండ‌ర్ డేనియెల్ సామ్స్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఈ సీజ‌న్‌లో అత‌డు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్రాతినిధ్యం వ‌హించ‌నున్నాడు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని.. హోట‌ల్ రూమ్‌లో క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు బెంగ‌ళూరు ట్వీట్ చేసింది.

కాగా.. ఆస్ట్రేలియా ఆట‌గాడు అయిన డేనియెల్‌కు ఏప్రిల్ 3న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చింది. దీంతో అత‌డు బెంగ‌ళూరు శిబిరంలో చేరాడు. అయితే.. నేడు చేసిన ప‌రీక్ష‌ల్లో అత‌డికి పాజిటివ్ వ‌చ్చింది. అయితే.. లక్షణాలు ఏవీ లేవని, ఐసోలేషన్‌లో ఉన్నాడని బెంగ‌ళూరు చెప్పింది. బీసీసీఐ ప్రోటోకాల్స్ ప్రకారం వైద్య బృందం డేనియల్ ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని తెలిపింది. కాగా.. ఇప్పటికే ఆ జట్టుకే చెందిన ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆర్‌సీబీ జ‌ట్టు ఏప్రిల్ 9న చెన్నై జ‌ట్టుతో త‌మ తొలి మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుంది.


Next Story