క‌ఠిన ప‌రీక్ష‌కు టీమ్ఇండియా సిద్దం.. ఇంగ్లాండ్‌తో సెమీస్ నేడే

CWG 2022 India Vs England Women Semi Final today.కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కీల‌క పోరుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Aug 2022 12:32 PM IST
క‌ఠిన ప‌రీక్ష‌కు టీమ్ఇండియా సిద్దం.. ఇంగ్లాండ్‌తో సెమీస్ నేడే

కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శ‌నివారం జ‌ర‌గ‌నున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో అతిథ్య ఇంగ్లాండ్ జ‌ట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్న భార‌త్‌.. ఆ త‌రువాత వ‌రుస‌గా పాకిస్తాన్‌, బార్బ‌డోస్‌ల‌పై భారీ విజ‌యాల‌ను న‌మోదు చేసి జోరు మీదుంది. మ‌రో వైపు ఇంగ్లాండ్ ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచుల్లో కూడా ఓట‌మి పాలు కాలేదు. దీంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య నేడు హోరా హోరీ పోరు ఖాయంగా క‌నిపిస్తోంది.

టీమ్ఇండియా సెమీస్ చేరిందంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం స్వింగ్ క్వీన్ రేణుకా సింగ్‌. మూడు మ్యాచుల్లో 9 వికెట్లు ప‌డ‌గొట్టి జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించింది. ప‌వ‌ర్ ప్లేలోనే ఇన్‌స్వింగ్‌తో బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు పెద్ద‌గా ఫామ్‌లో లేక‌పోవ‌డంతో వారిని రేణుక ఇబ్బందుల‌కు గురి చేసే అవ‌కాశం ఉంది. ఈమెకు తోడు దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్ కూడా ఫామ్‌లో ఉండ‌డం టీమ్ఇండియాకు క‌లిసి వ‌చ్చే అంశం.

బౌలింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుండ‌గా.. బ్యాటింగ్ స‌మ‌స్య టీమ్ఇండియాను వెంటాడుతోంది. అయితే..మ్యాచ్‌లో ఎవ‌రో ఒక‌రు అర్థ‌శ‌త‌కాల‌తో రాణిస్తుండ‌డం కాస్త ఊర‌ట నిచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో అర్ధశతకం చేసిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ బార్బడోస్‌పై డకౌట్‌ అయింది. పాక్‌పై 63 పరుగులతో రాణించిన స్మృతి మంధాన, బార్బడోస్‌పై కీలకపోరులో ఆరంభంలోనే పెవిలియన్‌ చేరింది. జెమిమా రోడ్రిగ్స్ సైతం వీరిలానే బార్బడోస్‌పై అర్ధశతకం సాధించినా ఆసీస్‌పై విఫలమైంది.

ఈ ముగ్గురు స్టార్ బ్యాట‌ర్లు ఒక్కొమ్యాచుల్లో రాణించ‌గా.. ఓపెన‌ర్ పెషాలీ వ‌ర్మ మూడు మ్యాచుల్లో 157.35 స్ట్రెక్‌రేట్‌తో 107 పరుగులు సాధించి భార‌త్ త‌రుపున టాప్ స్కోర‌ర్ గా నిలిచింది. కీల‌క మైన సెమీస్ మ్యాచ్‌లో ఈ న‌లుగురు త‌ప్ప‌కుండా రాణించాల్సిన అవ‌సరం ఉంది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బ్యాట‌ర్లు ఎలా ఆడ‌తారు అన్న దానిపైనే మ్యాచ్ ఫ‌లితం ఆధారప‌డి ఉంది.

ఇక సొంత గడ్డపై మ్యాచ్‌లు జరుగుతుండటం ఇంగ్లాండ్‌కు అతిపెద్ద బలం. శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాల‌పై చెల‌రేగి ఆడి మ్యాచ్‌ల‌ను ఏక‌ప‌క్షంగా మార్చేసింది. బౌలింగ్ త్ర‌యం కేథరిన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఇస్సీ వాంగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు. బ్యాటింగ్‌లో ఆలిస్ క్యాప్సే నిల‌క‌డ‌గా ఆడుతూ 3 మ్యాచ్‌ల్లో 117 పరుగులు చేసి టోర్నీలో రెండో టాప్‌స్కోరర్‌గా కొన‌సాగుతుంది.

Next Story