CSK skipper MS Dhoni fined Rs 12 lakh after loss against DC. చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు
By Medi Samrat Published on 11 April 2021 6:58 AM GMT
చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైకి షాక్ ఇచ్చింది. భారీ స్కోరును కాపాడుకోలేకపోయింది. ఇక మ్యాచ్ కోల్పోయిన బాధలో ఉండగా.. మరో ఊహించని షాక్ ధోనికి తగిలింది. ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలి మ్యాచులో చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరో షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ధోనీ చేసిన తొలి తప్పుగా దీనిని పరిగణించి ఆయనపై కేవలం జరిమానా వేసి వదిలేశారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్య చేధనతో క్రీజులోకి వచ్చిన ఢిల్లీ ఓపెనర్లు.. సీఎస్‌కే పేలవమైన బౌలింగ్‌ను చెండాడారు. శిఖర్ ధవన్ (54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85), పృథ్వీ షా (38 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 72) ఢిల్లీ క్యాపిటల్స్‌కు 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందించారు. ధోని దుమ్మురేపుతాడని భావించగా డకౌటయ్యాడు. ధోనీ 2015లో ఐపీఎల్‌లో చెన్నై టీమ్ తరఫున ఆడి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ధోనీ డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో లెగ్ సైడ్ ఆడాలని అనుకున్న ధోని ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో ధోని హిట్టింగ్ ను అభిమానులు మిస్ అయ్యారు. తర్వాతి మ్యాచ్ లో అయినా ధోని దుమ్ము రేపాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.