చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంచలనాల వీరుడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది.
By Medi Samrat
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది. ఈ జట్టులోని పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఇక ఎడమ చీలమండలో గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు వంశ్ బేడి దూరమయ్యాడు. అతడి స్థానంలో గుజరాత్ వికెట్ కీపర్-బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను స్థానంలోకి తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్ సందర్భంగా బేడి తన ఐపీఎల్ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. అతను ప్లేయింగ్ XIలో దాదాపుగా చోటు దక్కించుకున్నాడు. కానీ మ్యాచ్ కు కొన్ని క్షణాల ముందు గాయం కారణంగా దీపక్ హుడా అతడి స్థానంలో జట్టులోకి వచ్చాడు. బేడి ఈ సీజన్ నుండి తప్పుకోవడంతో, CSK ఉర్విల్ పటేల్‌ను జట్టులోకి తీసుకుంది.
ఉర్విల్ పటేల్ సంచలనాలకు కేరాఫ్. 26 ఏళ్ల ఉర్విల్ పటేల్‌కు టీ20 క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్‌పై 36 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఇప్పటి వరకు ఉర్విల్ 47 టీ20 మ్యాచ్‌లు ఆడి 170 స్ట్రైక్ రేట్‌తో 1162 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఇక కొన్ని మ్యాచ్ లు మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మిగిలి ఉండగా, 2026 సీజన్ లో అతడి సేవలను చెన్నై బాగా ఉపయోగించుకోనుంది.