ధోని అభిమానులకు శుభవార్త..
CSK official claims retention card will be used for Dhoni.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ విజయవంతంగా
By తోట వంశీ కుమార్ Published on 17 Oct 2021 3:08 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ విజయవంతంగా ముగిసింది. ధోని సారధ్యంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు నాలుగో సారి ఈ టోర్ని టైటిట్‌ను ముద్దాడింది. వచ్చే ఏడాది మరో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే.. పాత ప్రాంచైజీలు కొంత మంది ఆటగాళ్లు అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. అది ఇద్దరా లేదా ముగ్గురా లేదా నలుగురా అన్న సంగతి ఇంకా బీసీసీఐ వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ధోనిపై పడింది. చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని అట్టిపెట్టుకుంటుందా లేదా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ధోని తన భవితవ్యంపై స్పందించాడు. వచ్చే సీజన్‌లో చెన్నై తరుపున తాను ఆడే విషయాన్ని ధోని కొట్టిపారేయలేదు. 'వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వస్తున్నాయి. ఈ సమయంలో నా రిటైర్మెంట్ గురించి కాదు చెన్నై జట్టుకు ఏది మంచిదో అదే చేస్తాను. ఏ సీజన్లోనూ ఇబ్బంది పడకుండా ఉండే ఆటగాళ్లను తయారు చేయడం చాలా ముఖ్యం. రాబోయే 10 ఏళ్ల కోసం చెన్నై జట్టులో ఉండే ఆటగాళ్ల కోసం మేం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రాంచైజీ అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలో నేనుంటానా లేదా అన్నది ముఖ్యం కాదు.' అని ధోని అన్నాడు.
కాగా.. ఇదే విషయమై చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌కు రీటెన్షన్ పాలసీ ఉంటే మా మొదటి ప్రాధాన్యం ధోనికే ఉంటుందని చెప్పాడు. అయితే.. రిటెన్షన్ పాలసీ నియమాలు తెలుసుకోవాలన్నారు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నాడు. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలు కల్పిస్తే మాత్రం చెన్నై తొలి రిటెన్షన్ కార్డును ధోని కోసమే ఉపయోగిస్తుందన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చెన్నై ధోనిని వదులుకోదని.. ఓడకు కెప్టెన్ అవసరం ఉందన్నాడు. దీనిని బట్టి వచ్చే ఏడాది కూడా ధోని చెన్నై తరుపున ఆడతాడని అర్థం అవుతోంది.